అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Khammam | ఖమ్మం నగరంలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. శుక్రవారం రాత్రి కస్బాబజార్ (Kasba Bazar) ప్రాంతంలో ఓ మహిళను గుర్తుతెలియని దుండగుడు కత్తితో పొడిచి హత్య చేయడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. మాల్ పక్కన ఉన్న ఓ సందులో మహిళ రక్తపు మడుగులో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రి (Government Hospital)కి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమిక విచారణలో మృతురాలిని భద్రాచలం పట్టణానికి చెందిన మహిళగా గుర్తించారు. ఆమె కొంతకాలంగా ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు.
Khammam | లొంగలేదని..
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. పిల్లలు పుట్టలేదనే కారణంతో సదరు మహిళకు భర్తతో తరచూ గొడవలు జరుగుతూ ఉండగా, కొన్నేళ్లుగా భార్యాభర్తలు వేరుగా జీవిస్తున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని భర్త స్నేహితుడు శ్రావణ్ ఆమెను కొంతకాలంగా వేధిస్తున్నాడని తెలుస్తోంది. అతని వేధింపులకు విసిగిపోయిన ఆమె కుటుంబసభ్యులు నెల రోజుల క్రితమే శ్రావణ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో తనకు లొంగలేదనే కోపంతోనే శ్రావణ్ సదరు మహిళపై కత్తితో దాడి చేసి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ (CCTV Footage)ను సేకరించి పరిశీలిస్తున్నామని, అనుమానితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టామని అధికారులు తెలిపారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనతో కస్బాబజార్ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. మహిళల భద్రతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తుండగా, నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.