అక్షరటుడే, ఇందూరు: Municipal Elections | మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు (Chief Secretary Ramakrishna Rao) తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) నుంచి మున్సిపల్ శాఖ కార్యదర్శి శ్రీదేవితో కలిసి సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు.
Municipal Elections | అభ్యంతరాలుంటే స్వీకరించాలి..
ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఫొటోతో కూడిన ఓటరు తుది జాబితా సోమవారం ప్రకటించడం జరిగిందని, 13న పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా ప్రకటన ఉంటుందన్నారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరించి పరిశీలన, పరిష్కారం చేసిన తర్వాత ఈనెల 16న పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రకటించడం జరుగుతుందన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బ్యాలెట్ బాక్సులు (ballot boxes), బ్యాలెట్ పేపర్ ప్రచురణ కోసం ప్రింటింగ్ ప్రెస్‌లను గుర్తించడం తదితర పనులను పూర్తి చేయాలన్నారు.
Municipal Elections | మూడు మున్సిపాలిటీల్లో..
జిల్లాలోని మూడు మున్సిపాలిటీలతోపాటు కార్పొరేషన్లో ఎన్నికల నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం నోడల్ అధికారులు, జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్టాటిస్టిక్స్, సర్వేలెన్స్ బృందాలు, సెక్టోరియల్ అధికారులు, నామినేషన్ స్వీకరణ కేంద్రాలు, సామాగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, సబ్ కలెక్టర్లు వికాస్ మహతో, అభిగ్యాన్ మాల్వియా, ట్రెయినీ కలెక్టర్ కరోలిన్ చింగ్తియాన్మావి, నగరపాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.