Homeతాజావార్తలుLocal Body Elections | బీసీలకు మొండి‘చేయి’.. 42 శాతం కోటాపై సర్కారు వెనక్కి..

Local Body Elections | బీసీలకు మొండి‘చేయి’.. 42 శాతం కోటాపై సర్కారు వెనక్కి..

స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్​ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతంలోపే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Local Body Elections | వెనుకబడిన వర్గాలకు (బీసీ) సర్కారు మొండి‘చేయి’ చూపింది. స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామన్న హామీ నుంచి వెనక్కు తగ్గింది. పంచాయతీ ఎన్నికలకు (Panchayat elections) సిద్ధమవుతున్న సర్కారు.. తాజాగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జీవో విడుదల చేసింది.

సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాల మేరకు 50 శాతం లోపే రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. పాత పద్ధతిలోనే బీసీలకు 27 శాతం కోటా కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయంపై బీసీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టబద్ధంగా 42 శాతం రిజర్వేషన్లు కల్పించాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఉద్యమం లేవదీస్తామని బీసీ సంఘాలు (BC associations) హెచ్చరిస్తున్నాయి.

Local Body Elections | ఆశ పెట్టి..

అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలకు (assembly elections) ముందు హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కోటా (BC quota) తేల్చేందుకు రాష్ట్రంలో కుల గణన చేపట్టి, బీసీల లెక్క తేల్చింది. ఆ తర్వాత స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ వద్దకు పంపించింది.

అయితే, రిజర్వేషన్ల 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో గవర్నర్ ఆమోదించకుండా, రాష్ట్రపతి పరిశీలనకు పంపించారు. అది పెండింగ్ లో ఉండడంతో, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో నం.49ను జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా స్థానిక సంస్థలకు ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల కావడంతో బీసీల్లో హర్షం వ్యక్తమైంది. అయితే, రిజర్వేషన్ల వ్యవహారం హైకోర్టుకు (High Court) చేరగా, జీవోపై స్టే విధించింది. ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలకు వెళ్లాలని తాజాగా నిర్ణయించింది.

Local Body Elections | పాత రిజర్వేషన్లే..

పాత రిజర్వేషన్ల మేరకు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఆ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ మేరకు రిజర్వేషన్ల ఖరారుకు సంబంధించి శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక (BC Dedication Commission report), సుప్రీం తీర్పు, పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది.

దీనిపై బీసీ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వకుండా బీసీలకు అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నాయి. చట్టబద్ధంగా 42 శాతం కోటా ఇచ్చాకే ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 69 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకూ తమిళనాడులో (Tamil Nadu) గతంలో తొమ్మిదేళ్ల వరకు ఎన్నికలు నిర్వహించలేదని గుర్తు చేస్తున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్‌ సర్కారు కూడా అలాగే చేయాలని కోరుతున్నాయి. ఇచ్చిన హామీ మేరకు కోటా ఇవ్వకపోతే భారీ ఉద్యమం తప్పదని ఆర్‌.కృష్ణయ్య తదితర బీసీ నేతలు హెచ్చరించారు.

Local Body Elections | బీసీలకు వెన్నుపోటు..

వాస్తవానికి బీసీలను మొదటి నుంచి రాజకీయ పక్షాలు మోసం చేస్తూనే ఉన్నాయి. పార్టీల సంకుచిత వైఖరి వల్ల వెనుకబడిన వర్గాలకు చట్టబద్ధంగా దక్కాల్సిన కోటా దక్కకుండా పోయింది. బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్న అన్ని రాజకీయ పక్షాలు.. వారికి న్యాయం చేయడానికి మాత్రం ముందుకు రావడం లేదు. సామాజిక న్యాయం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వంటి ప్రధాన పార్టీలన్నీ సామూహికంగా వైఫల్యం చెందాయి.

వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయడానికి ప్రయత్నించకుండా ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకోవడానికే పరిమితమవుతున్నాయి. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని చెప్పడం తప్పితే అమలు కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించడం లేదు. అధికార పార్టీతో పాటు విపక్షాలు సైతం అదే వైఖరి ఎంచుకోవడంతో వెనుకబడిన వర్గాలు వెనుకబడే ఉంటున్నాయి తప్పితే ముందడుగు వేయడం లేదు. చివరకు కాంగ్రెస్ ఏదో ప్రయత్నం చేసినప్పటికీ, చట్టబద్ధంగా, నిబంధనల ప్రకారం లేకపోవడం మూలంగా ఆ ప్రయత్నం విఫలమైంది. పార్టీలకు చిత్తశుద్ధి లేకపోవడం, ఎవరికి వారే రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నించడంతో బీసీలకు మళ్లీ నిరాశే మిగిలింది.