అక్షరటుడే, వెబ్డెస్క్: Investing in Gold | బంగారం, వెండితో భారతీయ సమాజానికి విడదీయలేని అనుబంధం ఉంది. ముఖ్యంగా దేశ మహిళలు పసిడి, రజత ఆభరణాలపై ఆసక్తి చూపుతారు.
భారత ప్రజలు ఏళ్లుగా బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. గతంలో డబ్బులు ఉంటే బంగారం, వెండి కొనుగోలు చేసి పెట్టుకునే వారు. డబ్బు ఖర్చు అయిపోతుందని, పసిడి అయితే అవసరానికి అమ్ముకోవచ్చని భావించేవారు. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు తమ స్థాయిని బట్టి బంగారం, వెండి కొనుగోలు చేసేవారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బంగారం ధరలు (Gold Prices) ఆకాశాన్ని అంటేలా పెరగడంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది. అయితే ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు మాత్రం ఎక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేసినా రిస్క్ ఉంటుందని బంగారంపై ముదుపు చేసేవారు. కానీ కొన్ని రోజులుగా బంగారం, వెండి రేట్లలో హెచ్చుతగ్గులు వారిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.
Investing in Gold | అసాధారణ రీతిలో..
బంగారం, వెండి ధరలు (Silver Prices) గతంలో క్రమంగా పెరిగేవి. అయితే ఇటీవల రోజుల వ్యవధిలోనే భారీగా రేట్లు పెరిగాయి. రాకెట్ వేగంతో ధరలు దూసుకుపోయి బంగారం తులం రూ.1.80 లక్షలకు, వెండి కిలో రూ.4 లక్షలకు చేరింది. అనంతరం ఒక్కసారి ధరలు పడిపోయాయి. అంతర్జాతీయ పరిణామాలో రేట్లు పడిపోయినా.. ప్రజలు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఇన్ని రోజులు సురక్షిత పెట్టుబడిగా భావించిన పసిడి, వెండి సైతం ఒక్కసారి క్రాష్ కావడంతో.. ఇందులో పెట్టుబడి పెట్టడానికి ఆలోచిస్తున్నారు. కాగా కొద్ది రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు భారీగా ఉండటమే ఇందుకు కారణం.
Investing in Gold | భారీగా తగ్గిన బంగారం ధరలు
దేశీయ మార్కెట్లో గురువారం బంగారం ధరలు (Today Gold Prices) భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.5,020 తగ్గి రూ.1,54,420కి చేరింది. 22 క్యారెట్ల ధర రూ.4,600 తగ్గి రూ.1,41,550 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో వెండి ఏకంగా రూ.20 వేలు తగ్గి రూ.3 లక్షలకు చేరింది. వెండి ధరలో మార్పులు విపరీతంగా ఉంటుండటంతో ప్రజలు కొనుగోలు చేయడానికి ఆలోచిస్తున్నారు.