అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Hyderabad | చదువు చెప్పాల్సిన టీచర్లు హేళనగా మాట్లాడారు. అమ్మాయి పరిస్థితి అర్థం చేసుకోవాల్సిన మహిళా అధ్యాపకులు అవమానించారు. దీంతో ఓ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.
మల్కాజ్గిరి (Malkajgiri)లోని వెస్ట్ మారేడ్‌పల్లికి చెందిన వర్షిణి ఎంఆర్ బాలికల ప్రభుత్వ జూనియర్ కాలేజీ (Government Junior College)లో ఫస్టియర్ చదువుతోంది. అయితే గురువారం ఆమె కాలేజీకి ఆలస్యంగా వెళ్లింది. దీంతో లెక్చరర్లు శ్రీలక్ష్మీ, మధురిమ ఆమెను ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడిగినట్లు తెలిసింది. క్రమ శిక్షణ పేరుతో హేళనగా మాట్లాడినట్లు సమాచారం. తనకు పీరియడ్స్ వచ్చాయని, అందుకే ఆలస్యం అయిందని సదరు విద్యార్థి చెప్పగా.. అధ్యాపకులు అవమానించారు. ‘‘పీరియడ్స్ వచ్చాయా.. నాటకాలు ఆడుతున్నావా ఏది చూపించు”అంటూ తోటి విద్యార్థుల ముందు అత్యంత క్రూరంగా మాట్లాడారు. దీంతో వర్షిణి తీవ్ర మనోవేదనకు గురైంది.
Hyderabad | ఇంటికి వెళ్లాక..
కాలేజీలో అధ్యాపకులు అవమానించడంతో వర్షిణి ఇంటికి వెళ్లింది. టీచర్లు అన్న మాటలతో మనస్తాపం చెందింది. తన తల్లికి విషయం చెప్పింది. ఈ క్రమంలో ఇంట్లో అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే మల్కాజ్గిరి ఆస్పత్రికి తరలించారు. అనంతరం గాంధీకి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి వర్షిణి మృతి చెందింది. మనస్తాపం చెందడంతో మెదడులో రక్తం గడ్డ కట్టి చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. దీంతో అధ్యాపకులు అవమానించడంతోనే వర్షిణి చనిపోయిందని కుటుంబ సభ్యులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. కాలేజీ ముందు విద్యార్థులు, కుటుంబ సభ్యులు ధర్నా చేశారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.