అక్షరటుడే, భీమ్‌గల్: Panchayat Elections | మండలంలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. బుధవారం జరగనున్న పోలింగ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ద్వారా మంగళవారం ఎన్నికల సిబ్బందికి పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేశారు. ఈ ప్రక్రియను ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, తహశీల్దార్ మహమ్మద్ షబ్బీర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ పర్యవేక్షించారు.
Panchayat Elections | పోరులో నిలిచింది వీరే..
మండలంలోని మొత్తం 27 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటికే నాలుగు పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 23 సర్పంచ్ స్థానాలకు (Sarpanch positions) 98 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే మొత్తం 244 వార్డుల్లో 72 ఏకగ్రీవం కాగా.. 172 వార్డు స్థానాలకు 447 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా 23 గ్రామాల్లో పకడ్బందీగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
Panchayat Elections | భారీ భద్రత.. పకడ్బందీ ఏర్పాట్లు
ఎన్నికల విధులను నిర్వహించేందుకు సుమారు 600 మంది సిబ్బందిని నియమించారు. సామగ్రిని తీసుకున్న సిబ్బంది తమకు కేటాయించిన గ్రామాలకు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐలు సత్యనారాయణ గౌడ్, అంజయ్య, 10 మంది ఎస్సైలు, 129 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సమస్యాత్మక గ్రామాల్లో గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.