అక్షరటుడే, వెబ్డెస్క్ : Vaikuntha Ekadashi | తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలకు భారీగా తరలి వస్తారు. ఆ రోజు వైకుంఠ (ఉత్తర) ద్వార దర్శనం చేసుకుంటే మంచిదని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో టీటీడీ అధికారులు (TTD Officers) భక్తుల కోసం ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేస్తారు.
ఈ ఏడాది డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) ఉంది. ఆ రోజు నుంచి పది రోజుల పాటు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వివరాలు వెల్లడించారు. సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్య భక్తులకే కేటాయించున్నట్లు ఆయన తెలిపారు.
Vaikuntha Ekadashi | పలు దర్శనాలు రద్దు
వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా పలు రకాల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మొదటి మూడు రోజులు రూ.300, శ్రీవాణి దర్శనాలు నిలిపివేస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు నిత్యం 15 వేల రూ.300 దర్శన టిక్కెట్లు, వేయి శ్రీవాణి దర్శన టికెట్లు రెగ్యులర్ పద్ధతిలో కేటాయిస్తునట్లు వెల్లడించారు. భక్తులకు ఇబ్బందులు కల్గకుండా అన్ని చర్యలు చేపడుతామని ఆయన తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) పాలకమండలి సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ మీటింగ్ అనంతరం ఆయన వివరాలు మీడియాకు తెలిపారు.
పది రోజుల పాటు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రివిలేజ్ దర్శనాలు రద్దు చేశారు. స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా సిఫార్సు లేఖలు స్వీకరించమని అధికారులు తెలిపారు. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 భక్తులు టోకెన్ల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. డిసెంబర్ 2న డిప్లో ఎంపికైన వారికి దర్శన సమాచారాన్ని పంపిస్తామని వివరించారు. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5వేల టోకెన్లు చొప్పున స్థానికులకు కేటాయిస్తామన్నారు. మొదట వచ్చిన వారికి టోకెన్లు ఇస్తారు.
