అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Volcano Eruption | ఓ అగ్ని పర్వతం దాదాపు 10 వేళ ఏళ్ల తర్వాత బద్దలైంది. దీని ప్రభావంతో బూడిద 15 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసి పడింది. ఆ బూడిద మేఘాలు 12 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి భారత్‌పై సైతం ప్రభావం చూపాయి.
ఆఫ్రికా దేశం ఇథియోపియాలోని హైలీ గుబ్బి అగ్నిపర్వతం (Haile Gubbi Volcano) నవంబర్ 23న ఉదయం విస్పోటనం చెందింది. డనాకిల్ డిప్రెషన్ ప్రాంతంలో దీనిని గుర్తించారు. భూమి కింద షీల్డ్ వోల్కానో నుంచి 15 కి.మీ ఎత్తుకు ఎగసిపడుతూ బూడిద ఆకాశాన్ని కమ్మేసింది. బూడిద మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమెన్, ఒమన్‌కు చేరుకున్నాయి. అనంతరం అరేబియా సముద్రం (Arabian Sea) మీదుగా పశ్చిమ, ఉత్తర భారతదేశం (North India) వైపు ప్రయాణించింది. ఇవి ప్రస్తుతం తూర్పు వైపు చైనా వైపు కదులుతున్నాయి. మంగళవారం సాయంత్రం 7:30 గంటలకు భారత ఆకాశాన్ని క్లియర్ చేస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) పేర్కొంది.
Volcano Eruption | విమాన రాకపోకలకు అంతరాయం
అగ్నిపర్వత బూడిద గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు వంటి భారత రాష్ట్రాలకు చేరుకుని, హిమాలయాలు, నేపాల్ కొండల వైపు వెళ్లింది. ఇథియోపియా నుంచి బూడిద మేఘాన్ని అధిక ఎత్తులో ఉన్న గాలులు ఎర్ర సముద్రం, యెమెన్ మరియు ఒమన్ మీదుగా మోసుకెళ్లి అరేబియా సముద్రం మరియు భారత గగనతలాన్ని చేరాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మోహపాత్ర వివరించారు. ఆకాశాన్ని బూడిద మేఘాలు కప్పేయడంతో భారత్‌లోని పలు విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. పలు ఫ్లైట్లను రద్దు చేశారు. కొన్నింటిని దారి మళ్లించారు.
