అక్షరటుడే, వెబ్‌డెస్క్ : INS Mahe | భారత అమ్ముల పొదిలో మరో కీలక అస్త్రం చేరింది. అత్యాధునిక యాంటి సబ్ మెరైన్ వార్ఫేర్ షాలో ఐఎన్ఎస్ మాహే నౌకదళానికి చేరింది. ముంబై నేవల్ డాక్‌యార్డ్‌లో దీనిని నేవీకి అప్పగించారు. ఈ కార్యక్రమానికి ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది (Army Chief Upendra Dwivedi) , వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ హాజరయ్యారు.
INS Mahe | సైలెంట్ హంటర్
ఐఎన్ఎస్ మాహే (INS Mahe) వాటర్‌క్రాఫ్ట్ నీటిలో నిశ్శబ్దంగా కదులుతుంది. దీంతో శత్రదేశాలకు చెందిన జలాంతర్గాములు దీని రాకను సులువుగా గుర్తించలేవు. అందుకే దీనిని సైలెంట్ హంటర్ (Silent Hunter) అని పిలుస్తారు. ఇందులో సోనార్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఇతర దేశాల జలాంతర్గాములు, మైన్స్ కనిపెట్టేందుకు ఇది ఉపయోగ పడుతోంది. దీనిని స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. డీఆర్డీవో డెవలప్ చేసిన అభయ్ హల్-మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ నౌకలో ఐఆర్‌ఎల్ యాంటీ-సబ్‌మెరైన్ రాకెట్ లాంఛర్, అడ్వాన్స్‌డ్ ట్రిపుల్ లైట్‌వెయిట్ టార్పెడో లాంఛర్, 30 ఎంఎం నావెల్ సర్ఫేస్ గన్, యాంటీ-సబ్‌మెరైన్ మైన్స్ ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి.
INS Mahe | ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
ఐఎన్ఎస్ మాహేను ప్రారంభించిన అనంతరం ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది మాట్లాడారు. బహుళ-డొమైన్ కార్యకలాపాల యుగంలో సముద్రం లోతు నుంచి అత్యున్నత సరిహద్దు వరకు కలిసి పనిచేయగల సామర్థ్యం భారత్‌కు ఉందన్నారు. సాయుధ దళాల బలం సినర్జీలో ఉందని చెప్పారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం (Air Force) కలిసి భారతదేశ వ్యూహాత్మక శక్తి త్రిమూర్తులను ఏర్పరుస్తాయన్నారు. లడఖ్ నుంచి హిందూ మహాసముద్రం వరకు, సమాచార యుద్ధం నుంచి ఉమ్మడి లాజిస్టిక్స్ వరకు ప్రతి డొమైన్‌లో తాము ఒక కార్యాచరణ కన్నుగా ఉన్నామన్నారు.
