అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Panchayat Elections | లింగ మోరిగూడెం (Linga Morigudem)లో ప్రతిపక్ష అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకునేందుకు రెండుసార్లు ఇంటింటికీ చికెన్ పంపిణీ చేసినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు పోలింగ్‌కు ముందు రోజు ప్రతి ఓటుకు రూ.750 నగదు, ఒక కిలో చికెన్ (Chicken)తో పాటు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, అదనంగా ఒక క్వార్టర్ మద్యం లేదా బీరు చొప్పున ఇచ్చినట్లు చెప్పుకుంటున్నారు.
పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు ఈసారి కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టారు. సంప్రదాయంగా నగదు, మద్యం వరకు పరిమితమైన ప్రచారం, ఈ ఎన్నికల్లో మాంసాహారంతో ముడిపడి కొత్త మలుపు తిరిగింది. సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు మటన్, చికెన్‌ను నేరుగా వారి ఇళ్లకే పంపిణీ చేశారు. పున్నేలు గ్రామంలో ఈ వ్యవహారం హద్దులు దాటి చర్చనీయాంశంగా మారింది. కేవలం మూడు రోజుల్లో ఏకంగా 12 క్వింటాళ్ల చికెన్‌ను ఓటర్లకు సరఫరా చేసినట్లు సమాచారం. ఈ చికెన్ మొత్తం ఒకే షాపు నుంచి సరఫరా చేయగా, దాని విలువ సుమారు రూ.1.22 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. పున్నేలు గ్రామంలో 3,158 మంది ఓటర్లు ఉండగా, జనాభా నాలుగు వేల పైచిలుకు ఉంది. ఇక్కడ సర్పంచ్ పదవికి ముగ్గురు అభ్యర్థులు బరిలోకి దిగారు.
Panchayat Elections | ఓటర్ల మచ్చిక కోసం…
ఒకరు అధికార కాంగ్రెస్ (Congress) అభ్యర్థి కాగా, మరొకరు కాంగ్రెస్ రెబల్, ఇంకొకరు బీఆర్ఎస్ (BRS )తరఫున పోటీ చేశారు. మొదట ఒక పార్టీకి చెందిన వార్డు సభ్యులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఇంటింటికీ రూ.100ల విలువ చేసే ముప్పావు కిలో చికెన్‌ను కవర్లలో ప్యాక్ చేసి పంపిణీ చేశారు. దీన్ని చూసిన ఇతర అభ్యర్థులు కూడా పోటీపడి ఉదయం, సాయంత్రం ఒక్కో ఇంటికి రూ.100ల చికెన్ చొప్పున పోలింగ్‌కు ముందు రోజు రాత్రి వరకు పంపించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో మూడు రోజుల పాటు ఊరంతా చికెన్ వంటల మసాలా వాసనలతో ఘుమఘుమలాడిందని స్థానికులు సరదాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన ముగ్గురు సర్పంచ్ అభ్యర్థులు (Sarpanch Candidates) తలా రూ.50 లక్షల వరకు ఖర్చు చేసినట్లు ప్రచారం సాగుతోంది.
చివరికి బీఆర్ఎస్ అభ్యర్థి 148 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మరోవైపు లింగ మోరిగూడెంలోనూ ఇదే తరహా పరిణామాలు చోటు చేసుకున్నాయి. అక్కడ ప్రతిపక్ష అభ్యర్థి రెండు సార్లు చికెన్‌ను ఇంటింటికీ పంపిణీ చేశారని ఆరోపణలు ఉన్నాయి. పోలింగ్‌కు ముందు రోజు ఓటుకు రూ.750 నగదు, కిలో చికెన్‌తో పాటు కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక క్వార్టర్ మద్యం లేదా బీరు ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఓట్లు సాధించేందుకు అభ్యర్థులు చేస్తున్న ఈ గిమ్మిక్కులు చూసి ఓటర్లే ముక్కున వేలేసుకునే పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.