అక్షరటుడే, వెబ్‌డెస్క్: Food Delivery | ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సేవల్లో డెలివరీ ఏజెంట్లు ఎదుర్కొనే సమస్యలపై మరోసారి చర్చ మొదలైంది. అర్ధరాత్రి సమయంలో ఫుడ్ డెలివరీ విషయంలో కస్టమర్‌తో తలెత్తిన వివాదం అనంతరం, ఓ జొమాటో డెలివరీ పార్ట్‌నర్ (Zomato Delivery Partner) ఆ ఆర్డర్‌ను తానే తినేశాడు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు కేంద్రంగా నిలిచిన వ్యక్తి అంకుర్ ఠాకూర్ అనే జొమాటో డెలివరీ ఏజెంట్. ఆయన తెల్లవారుజామున సుమారు 2:30 గంటల సమయంలో ఓ అపార్ట్‌మెంట్‌కు ఫుడ్ డెలివరీకి వెళ్లాడు. అయితే వాహనాన్ని కింద వదిలి పైకి వెళ్లే సమయంలో దొంగతనం జరిగే అవకాశం ఉందనే భయంతో, కస్టమర్‌ను కిందికి వచ్చి ఆర్డర్ తీసుకోవాలని కోరాడు.
Food Delivery | వెరైటీగా ఉందిగా..
అయితే కస్టమర్ దీనికి అంగీకరించలేదు. డోర్‌స్టెప్ డెలివరీ (Door Step Delivery) కోసం డబ్బులు చెల్లించామని, అందుకే ఇంటి వద్దకే ఫుడ్ ఇవ్వాల్సిందేనని కస్టమర్ వాదించాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి వాగ్వాదంగా మారింది. కస్టమర్ తనతో దురుసుగా మాట్లాడాడని, ఆర్డర్‌ను క్యాన్సిల్ చేస్తానని బెదిరించాడని అంకుర్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ వివాదం తర్వాత ఆర్డర్ క్యాన్సిల్ అయినట్లు చెప్పిన అంకుర్, “ఇప్పుడు ఈ ఫుడ్ నేనే తినేస్తున్నాను” అంటూ బిర్యానీ కాంబోలోని గులాబ్ జామూన్‌ను తింటూ వీడియో రికార్డ్ చేశాడు. ఆ వీడియోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. కొన్ని గంటల్లోనే ఈ వీడియోకు 12 లక్షలకుపైగా వ్యూస్ రావడం విశేషం.
ఈ ఘటనపై సోషల్ మీడియా (Social Media)లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు డెలివరీ ఏజెంట్ భద్రతే ముఖ్యమని, అర్ధరాత్రి అపార్ట్‌మెంట్లలోకి వెళ్లడం ప్రమాదకరమని అతడికి మద్దతు తెలుపుతున్నారు. “డెలివరీ బాయ్స్ పరిస్థితులు ఎవ్వరూ అర్థం చేసుకోరు” అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, డోర్‌స్టెప్ డెలివరీకి కస్టమర్ డబ్బులు చెల్లించినప్పుడు ఇంటి వద్దకే ఫుడ్ ఇవ్వాల్సిందేనని మరికొందరు వాదిస్తున్నారు. ఈ ఘటనతో జొమాటో సేవల (Zomato Services) నాణ్యతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. జొమాటో పాలసీ ప్రకారం, కస్టమర్ అందుబాటులో లేకపోయినా లేదా నిర్దిష్ట సమయం వరకు స్పందించకపోయినా డెలివరీ ఏజెంట్ ఆర్డర్‌ను క్యాన్సిల్ చేసే అవకాశం ఉంటుంది. అయితే, కొన్ని అపార్ట్‌మెంట్లలో భద్రతా కారణాల వల్ల అర్ధరాత్రి వేళ డెలివరీ ఏజెంట్లను లోపలికి అనుమతించకపోవడం కూడా సాధారణమే. ఈ నేపథ్యంలో ఏజెంట్ తీసుకున్న నిర్ణయం సరైందా? కస్టమర్ అంచనాలే తప్పా? అనే అంశంపై చర్చ జరుగుతోంది.