అక్షరటుడే, వెబ్‌డెస్క్ : ACB Raid | రాష్ట్రంలో అవినీతి రాజ్యం ఏలుతోంది. పలువురు అటెండర్ స్థాయి ఉద్యోగుల నుంచి ఐఏఎస్ అధికారుల వరకు లంచాలు తీసుకుంటున్నారు. స్థాయిని బట్టి భారీగా అక్రమాస్తులు కూడబెడుతున్నారు.
ఏసీబీ (ACB) అధికారులు ఇటీవల దూకుడు పెంచారు. బాధితుల ఫిర్యాదు మేరకు అవినీతి అధికారులను వల పన్ని పట్టుకుంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సైతం దాడులు చేపడుతున్నారు. అయినా అవినీతికి మరిగిన అధికారులు మారడం లేదు. తాజాగా ఏసీబీ అధికారులు అదనపు కలెక్టర్ ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఆయన ఆస్తులు చూసి వారు షాక్ అయ్యారు.
ACB Raid | ఏకకాలంలో సోదాలు
హనుమకొండ (Hanmakonda) అదనపు కలెక్టర్ పనిచేసిన వెంకట్‌రెడ్డి డిసెంబర్ 5న లంచం తీసుకుంటూ దొరికాడు. దీంతో అధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఓ ప్రైవేట్ స్కూల్ పునరుద్ధరణకు సంబంధించిన ఫైల్‌ను ప్రాసెస్ చేయడానికి వెంకట్ రెడ్డి లంచం డిమాండ్ చేశాడు. ఆ సమయంలో అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేపట్టగా.. రూ.30 లక్షల నగదు దొరికింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బుధవారం వెంకట్ రెడ్డి ఇళ్లలో దాడులు చేపట్టారు. హైదరాబాద్ (Hyderabad), నల్గొండ, మిర్యాలగూడలోని 8 ప్రాంతాల్లో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు.
ACB Raid | స్వాధీనం చేసుకున్న ఆస్తులు
అధికారులు వెంకట్‌రెడ్డి నివాసాల్లో రూ.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 2 కేజీల బంగారం (2 KG Gold), లాకర్‌లో రూ.42 లక్షల నగదు, ఎల్బీ నగర్ (LB Nagar)లో విలాసవంతమైన ఇల్లు, విల్లా, 10 ప్లాట్లు అక్రమంగా కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వెంకట్ రెడ్డి అక్రమ మార్గాల ద్వారా కూడబెట్టిన ఆస్తుల విలువ రూ. 10 కోట్ల వరకు ఉంటుందని అంచానా.