అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Honey Trap | తక్కువ కాలంలో డబ్బు సంపాదించడానికి కొందరు వక్రమార్గాలు పడుతున్నారు. హనీట్రాప్(Honey Trap) పేరిట డబ్బున్న వారికి వల విసురుతున్నారు. అనంతరం బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారు.
ఓ ముఠా తాజాగా యోగా గురువు(Yoga Teacher)ను హనీట్రాప్ చేసి భారీగా డబ్బులు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. రంగారెడ్డి జిల్లా(Rangareddy District) చేవెళ్లలో ఓ వ్యక్తి యోగా ఆశ్రమం నిర్వహిస్తున్నాడు. ఆయన దగ్గరకు యోగా కోసం ఎంతో మంది వస్తుంటారు. ఈ క్రమంలో భారీగా విరాళాలు సైతం ఇస్తుంటారు. దీంతో ఆయన దగ్గర డబ్బులు కాజేయాలని అమర్ గ్యాంగ్ ప్లాన్ వేసింది.
Honey Trap | అనారోగ్యం పేరిట
తమకు ఆరోగ్యం బాగా ఉండటం లేదని ఇద్దరు మహిళలు యోగా ఆశ్రమంలో చేరారు. అనంతరం తక్కువ కాలంలో యోగా గురువు రంగారెడ్డికి దగ్గరయ్యారు. అతడితో సన్నిహితంగా మెలిగారు. సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వీడియోలు తీశారు. అనంతరం వారి గ్యాంగ్ మెంబర్ అయిన అమర్ ఆ ఫొటోలు చూపించి బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో యోగా గురువు ఆ ముఠాకు రూ.50 లక్షలు చెల్లించాడు. అయినా వారి వేధింపులు ఆగలేదు. మరో రూ.2 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఫొటోలు, వీడియోలు బయట పెడతామని బెదిరించారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Honey Trap | వల పన్ని పట్టుకున్న పోలీసులు
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. డబ్బులు ఇస్తామని పోలీసులు గోల్కొండకు రమ్మని నిందితులకు చెప్పారు. అనంతరం అక్కడకు వచ్చిన ఐదుగురు నిందితులను పట్టుకున్నారు. నిందితులు అమర్, మౌలాలి, రాజేశ్, మంజుల, రజని అరెస్ట్ అయినట్లు సమాచారం. వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా నగరంలో ఇటీవల హానీ ట్రాప్ కేసులు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ధనవంతులైన వృద్ధులు, రిటైర్డ్ ఉద్యోగులే లక్ష్యంగా కొందరు హనీట్రాప్ చేస్తున్నారు. మరికొందరు పెళ్లి చేసుకుంటామని నమ్మించి మోసాలకు పాల్పడుతున్నారు.