అక్షరటుడే, వెబ్‌డెస్క్: yoga poses | ఆధునిక కాలంలో ఉద్యోగ బాధ్యతల వల్ల చాలా మంది గంటల కొద్దీ కుర్చీకే పరిమితం కావాల్సి వస్తోంది. శారీరక శ్రమ లేని ఇటువంటి జీవనశైలి వల్ల వెన్నునొప్పి, మెడనొప్పి, స్థూలకాయం వంటి శారీరక సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి కూడా పెరుగుతోంది. వ్యాయామం చేయడానికి ప్రత్యేకంగా సమయం దొరకడం లేదని బాధపడేవారి కోసం వైద్య నిపుణులు చైర్ యోగాను సూచిస్తున్నారు. కూర్చున్న కుర్చీలోనే రోజూ ఒక పది నిమిషాలు కేటాయించి, పది రకాల ఆసనాలను వేస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు.
yoga poses | కుర్చీలోనే వేయగలిగే 10 ముఖ్యమైన ఆసనాలు:
క్యాట్-కౌ: రెండు చేతులూ మోకాళ్లపై ఉంచి, శ్వాస తీసుకుంటూ నడుమును ముందుకు, వదులుతూ వెనక్కి అనాలి. ఇది నడుము నొప్పిని నివారించడమే కాకుండా వెన్నెముకను ఫ్లెక్సిబుల్‌గా ఉంచుతుంది.
ఊర్థ్వ హస్తాసనం: చేతులు పైకి చాపి వెనక్కి వంచడం వల్ల రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడం వల్ల వచ్చే మెడనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాద హస్తాసనం: కూర్చున్న చోటే రెండు చేతులతో పాదాలను తాకాలి. ఇది పొట్ట దగ్గర కొవ్వును తగ్గించడమే కాకుండా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
పార్శ్వకోణాసనం: ఒక చేయి పైకి చాపి పక్కకు వంగడం వల్ల నడుము చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది, వెన్నునొప్పి తగ్గుతుంది.
రాజకపోతాసనం: ఒక కాలిపై మరో కాలు వేసి ముందుకు వంగాలి. ఇది సయాటికా నరాల సమస్యలకు, మోకాళ్ల నొప్పులకు మంచి మందులా పనిచేస్తుంది.
గరుడాసనం: చేతులు, కాళ్లను లంబకోణంలో ఉంచి చేసే ఈ ప్రక్రియ వల్ల కీళ్ల నొప్పులు దరిచేరవు.
వక్రాసనం: నడుమును పక్కకు తిప్పడం వల్ల వెన్నెముకకు మంచి వ్యాయామం లభిస్తుంది.
వీరభద్రాసనం: శరీరంలోని ప్రతి భాగాన్ని ఉత్తేజపరిచే ఈ ఆసనం బద్ధకాన్ని వదిలించి, తక్షణ శక్తిని ఇస్తుంది.
శవాసనం: కుర్చీలో ప్రశాంతంగా కూర్చుని శ్వాసపై దృష్టి పెట్టాలి. ఇది పని ఒత్తిడిని తగ్గించి, మెదడును చురుగ్గా ఉంచుతుంది.
తిర్యక్ తాడాసనం: చేతులు లాక్ చేసి ఇరువైపులా వంచడం వల్ల కండరాలు బిగుతుగా మారకుండా, శరీరం తేలికగా అనిపిస్తుంది.
ఈ ఆసనాలు వేయడానికి ప్రత్యేకమైన యోగా మ్యాట్ గానీ, ఎక్కువ స్థలం గానీ అవసరం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా వీటిని సులభంగా చేయవచ్చు. ముఖ్యంగా ఆఫీసుల్లో పని చేసేవారు పని మధ్యలో చిన్న విరామం తీసుకుని ఒక్కో ఆసనాన్ని ఒక్కో నిమిషం పాటు చేస్తే, రోజంతా ఉల్లాసంగా ఉండటమే కాకుండా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి తమను తాము కాపాడుకోవచ్చు. తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం వైద్య నిపుణుల సలహా ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది.