HomeUncategorizedData Leak | డిజిట‌ల్ ప్ర‌పంచంలో కొత్త ఆందోళ‌న‌లు.. 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి..

Data Leak | డిజిట‌ల్ ప్ర‌పంచంలో కొత్త ఆందోళ‌న‌లు.. 16 బిలియన్ల పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి..

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Data Leak | డేటా లీక్‌ ప్రస్తుతం అతిపెద్ద సమస్యగా మారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా కూడా హ్యాక‌ర్లు(Hackers) పాస్ వ‌ర్డ్‌ల‌ను క‌నిపెట్టేస్తున్నారు. ప్రపంచ ఇంటర్నెట్ చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్(Data Leak) ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఏకంగా 16 బిలియన్ (1,600 కోట్లు) యూజర్ అకౌంట్ల లాగిన్ వివరాలు, యూజర్‌నేమ్‌లు, పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల చేతికి చిక్కాయి. సైబర్ భద్రతా నిపుణులు(Cyber ​​security experts) ఈ విషయాన్ని ధృవీకరించారు. ఇది ప్రపంచ జనాభాలోని ప్రతి వ్యక్తికి ఒకటి లేదా రెండు ఖాతాల డేటా లీక్ అయినంత ప్రమాదకరమని అంచనా వేస్తున్నారు. ఈ సమాచార లీకేజీతో యాపిల్, ఫేస్‌బుక్, గూగుల్ వంటి దిగ్గజ సంస్థలతో పాటు గిట్‌హబ్, టెలిగ్రామ్‌తో పాటు వివిధ ప్రభుత్వ సేవలతో సహా ఊహకందని అనేక ఆన్‌లైన్ సేవల ఖాతాలకు ముప్పు వాటిల్లినట్టేనని ఫోర్బ్స్ నివేదిక హెచ్చరించింది.

Data Leak | డేంజ‌ర్ జోన్‌లో..

గతంలో 184 మిలియన్ల యూజర్ల లాగిన్‌ వివరాలు, పాస్‌వర్డ్‌లు లీకైనట్లు సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు తెలిపారు. ఇప్పుడు 16 బిలియన్‌ల లాగిన్‌ వివరాలు(16 billion login details) లీకైనట్లు వెల్లడించారు. అంతేకాదు, సైబర్‌ భద్రతా పరిశోధకులు మొత్తం 30 డేటాసెట్‌లను కూడా కనుగొన్నారు. ఒక్కో డేటాసెట్‌లో 3.5 బిలియన్‌ రికార్డులు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో సోషల్ మీడియా, డెవలపర్ పోర్టల్స్, అనేక ప్రధాన కంపెనీల ఖాతాల లాగిన్ ఆధారాలు ఉన్నాయి. ఆయా సంస్థలకు చెందిన ఖాతాల్లో 2025 ప్రారంభం నుంచి లాగిన్‌ ఖాతాల వివరాలు డేటాసెట్‌లో రికార్డ్‌ అవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ డేటా లీక్‌ వెనుక అనేక గ్రూపుల ప్రమేయం ఉందని సైబర్ భద్రతా పరిశోధకులు భావిస్తున్నారు.

ఇలాంటి డేటా ఉల్లంఘనల కారణంగానే గూగుల్ తన వినియోగదారులను పాస్‌వర్డ్‌లు, టూ-ఫ్యాక్టర్ అథెంటికేషన్ (2ఎఫ్ఏ) వంటి పాత సైన్-ఇన్ పద్ధతుల నుంచి బయటపడి, తమ జీమెయిల్ ఖాతా భద్రతను అప్‌గ్రేడ్ చేసుకోవాలని సూచిస్తోంది. మెరుగైన ఖాతా నియంత్రణ కోసం వినియోగదారులు పాస్‌కీ(Passkey)లతో పాటు సోషల్ సైన్-ఇన్‌లకు మారాలని టెక్ దిగ్గజం ప్రోత్సహిస్తోంది. సాధారణంగా యూజర్లు వివిధ వెబ్‌సైట్‌లలో సైన్‌అప్ అయ్యేటప్పుడు ఇచ్చే యూజర్‌నేమ్, పాస్‌వర్డ్ వంటి వివరాలను ఫిషింగ్ వెబ్‌సైట్‌లు(Phishing websites), మాల్‌వేర్(malware) లేదా డేటాబేస్ బ్రీచ్‌ల ద్వారా హ్యాకర్లు దొంగిలించినట్లు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా డీప్ వెబ్(Deep Web) , డార్క్ వెబ్‌(Dark Web)లో ఈ దొంగిలించిన డేటాను భారీగా అమ్ముతున్నట్లు సమాచారం. కొన్ని హ్యాకర్ల గ్రూపులు ఈ డేటాను సేకరించి URL లింకుల ద్వారా పాస్‌వర్డ్ డంప్‌లను విక్రయిస్తున్నారని తేలింది.