అక్షరటుడే, వెబ్‌డెస్క్ : World Records | వన్డే క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసే అవకాశం దాదాపు అసాధ్యమే. కారణం .. ప్రతి బౌలర్‌కు గరిష్టంగా 10 ఓవర్ల పరిమితి ఉంటుంది.
అటువంటి పరిమితుల్లోనే మిగిలిన తొమ్మిది మంది బౌలర్ల అవసరం లేకుండా ఒకే బౌలర్ (single bowler) 10 వికెట్లు తీయడం అనేది ప్రపంచ క్రికెట్ చరిత్రలో అరుదైన సంఘటన. కానీ ఈ అద్భుతాన్ని నిజం చేసి చూపించాడు నేపాల్‌కు చెందిన బౌలర్ మెహబూబ్ ఆలం(Mehboob Alam). 2008 మే 25న జరిగిన ఐసీసీ వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 5 టోర్నమెంట్‌లో నేపాల్ మరియు మొజాంబిక్ జట్లు తలపడగా, ఈ మ్యాచ్‌లో మెహబూబ్ ఆలం కేవలం 7.5 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 10 వికెట్లు పడగొట్టి క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు.
World Records | సూపర్ స్పెల్..
మెహబూబ్ (Mehaboob) వేసిన ఈ అద్భుతమైన బౌలింగ్ స్పెల్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్(Guinness Book of World Records)లో కూడా స్థానం సంపాదించింది. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంతటి అద్భుత ప్రదర్శన ఇప్పటివరకు ఏ బౌలర్ సాధించలేని రికార్డు. మ్యాచ్‌లో ముందు నేపాల్ బ్యాటింగ్ చేయగా, 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 238 పరుగులు చేసింది. ఇక మొజాంబిక్ లక్ష్యం 239 పరుగులు పరుగులు కాగా, 14.5 ఓవర్లలో కేవలం 19 పరుగులకే ఆలౌట్ అయింది. మెహబూబ్ బౌలింగ్ ఫిగర్స్ చూస్తే 7.5 ఓవర్లు – 1 మెయిడెన్ – 12 పరుగులు – 10 వికెట్లు తీసాడు. దీంతో 219 పరుగుల తేడాతో నేపాల్ ఘన విజయం సాధించింది . ఈ అద్భుత ప్రదర్శన తర్వాత మెహబూబ్ ఆలం పేరు అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందింది.
ఓ చిన్న దేశానికి చెందిన క్రికెటర్ అయినప్పటికీ, ప్రపంచ క్రికెట్ చరిత్రలో (world cricket History) తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. మెహబూబ్ ఆలం ఎడమచేతి మీడియం ఫాస్ట్ బౌలర్ కాగా, ఆయన వయస్సు ప్రస్తుతం 44 సంవత్సరాలు. వన్డే క్రికెట్ మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఏకైక బౌలర్. ఈ రికార్డ్ బ్రేక్ (Record Break) చేయడం అంత ఈజీ కాదు. రానున్న రోజులలో ఈ ఫీట్ ఎవరైన సాధిస్తారా? లేదంటే ఈ రికార్డ్ ఆలం పేరు మీద పదిలంగా ఉంటుందా అన్నది చూడాలి.