Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి: రఘునాథ్

Nizamabad City | న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి: రఘునాథ్

న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఫార్మర్ తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.రఘునాథ్ అన్నారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Nizamabad City | న్యాయవాదుల సంక్షేమం కోసం కృషి చేస్తానని హైకోర్టు సీనియర్ న్యాయవాది, ఫార్మర్ తెలంగాణ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వి.రఘునాథ్ అన్నారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల (Telangana Bar Council election) ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కోర్టును బుధవారం సందర్శించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.సాయరెడ్డి, బీఆర్​.మాణిక్ రాజు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో న్యాయవాదుల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. అలాగే తెలంగాణ స్వరాష్ట్ర సాధనకు జరిగిన ఉద్యమంలో కూడా న్యాయవాదులు కీలక భూమిక పోషించారని గుర్తు చేశారు.

బాధితుల పక్షాన పోరాడేది న్యాయవాదులే..

సమాజంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందు వరుసలో నిలిచి బాధితుల పక్షాన పోరాడేది న్యాయవాదులేనన్నారు. కానీ అలాంటి న్యాయవాదులపై దాడులు, హత్యలు జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు న్యాయవాదుల రక్షణ చట్టం (Lawyers Protection Act) తేవడంలో నిర్లక్ష్యం చేస్తున్నాయని పేర్కొన్నారు. తాను గెలిచిన తర్వాత న్యాయవాదుల రక్షణ చట్టం తెచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. మహిళలకు బార్ కౌన్సిల్​లో రాజ్యాంగబద్ధంగా తగిన అవకాశాలు అందడం లేదని పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా మహిళలకు సముచిత స్థానం కల్పించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అదే విధంగా 41Aను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. దీనిని కట్టడి చేయడంలో బార్ కౌన్సిల్ విపలమైందని అన్నారు. 41A దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుంటారని తెలిపారు. అదే విధంగా యువ న్యాయవాదులకు స్టైఫండ్ రూపంలో సహకారం అందించకపోవడం వలన చాలామంది వృత్తిలో నిలదొక్కుకోలేక కూలి పనులు చేసుకుంటున్నారని చెప్పారు. యువ న్యాయవాదులకు ప్రోత్సాహంగా వృత్తిలో నిలదొక్కుకోవడానికి తగిన స్టైఫండ్ అందించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా వెల్ఫేర్ స్టాంప్ రుసుం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో అత్యధికంగా 250 రూపాయలు చేయడం ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు.

పెన్షనర్ స్కీం అనేది చనిపోయిన తర్వాత కాకుండా ముందస్తుగా.. న్యాయవాదుల అవసరానికి తగ్గట్లుగా తీసుకునే వెసులుబాటు కల్పించాలన్నారు. న్యాయవాదులకు వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి శాశ్వత ప్రాతిపదికన శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమమే ప్రధాన జెండాగా పనిచేస్తామని చెప్పారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు, యువ న్యాయవాదులు, మహిళలు న్యాయవాదులు పాల్గొన్నారు.

Must Read
Related News