అక్షరటుడే, వెబ్‌డెస్క్: women’s premier league 2026 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL)లో ముంబయి ఇండియన్స్ Mumbai Indians తమ ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించింది. గుజరాత్ జెయింట్స్ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా ఛేదించిన ముంబయి.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌తో గుజరాత్ Gujarat Giants పై ముంబయికి ఎదురులేని ఆధిక్యం మరింత బలపడింది.
ముంబయి వేదికగా జరిగిన ఈ ఉత్కంఠభరిత పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జెయింట్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. చివరి ఓవర్లలో బ్యాటర్ల మెరుపులు ఆ జట్టుకు భారీ స్కోరు అందించాయి. జార్జియా వెర్‌హమ్ (43 నాటౌట్), ఫల్మలి (36 నాటౌట్), కనిక అహుజా (35) కీలక ఇన్నింగ్స్‌లతో స్కోరును వేగంగా పెంచారు. మధ్య ఓవర్లలో కాస్త నెమ్మదించినా చివరి మూడు ఓవర్లలో జెయింట్స్ బ్యాటర్లు విరుచుకుపడటంతో ముంబయికి గట్టి సవాలే ఎదురైంది.
women’s premier league 2026 | కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ..
193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబయికి ఆరంభంలోనే రెండు వికెట్లు పడినా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ Harmanpreet KAur కౌర్ జట్టు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దింది. అమన్‌జ్యోత్ కౌర్‌తో కలిసి ఆమె భారీ భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను ముంబయి వైపు తిప్పింది.
హర్మన్‌ప్రీత్ 43 బంతుల్లో 71 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, అమన్‌జ్యోత్ (40) దూకుడుగా ఆడి రన్‌రేట్‌ను అదుపులో ఉంచింది. చివరి దశలో నికోల కేరీ (38 నాటౌట్) వేగంగా పరుగులు రాబట్టి మ్యాచ్‌ను ముందుగానే ముగించింది. ముంబయి ఇండియన్స్ 19.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని డబ్ల్యూపీఎల్ చరిత్రలో తమ అత్యధిక ఛేదనను నమోదు చేసింది. అంతేకాదు, గుజరాత్ జెయింట్స్‌పై ఇప్పటివరకు ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించిన జట్టుగా తన రికార్డును మరింత పటిష్టం చేసుకుంది.
ఈ గెలుపుతో టోర్నీలో ముంబయి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోగా, గుజరాత్ Gujarat మాత్రం భారీ స్కోరు చేసినప్పటికీ విజయాన్ని అందుకోలేకపోయింది. డబ్ల్యూపీఎల్‌లో ముంబయి జోరు కొనసాగుతుందనడానికి ఈ మ్యాచ్ మరో నిదర్శనంగా నిలిచింది.