అక్షరటుడే, వెబ్‌డెస్క్: woman sub-inspector | కర్ణాటక – ఆంధ్రా సరిహద్దులో అక్రమ మద్యం రవాణాపై స్థానిక పోలీసులు నిఘా పెట్టారు. అయినా అక్రమార్కులు ఆగడం లేదు. ఏకంగా పోలీసులపైనే దాడికి తెగబడుతున్నారు. తాజాగా మహిళా ఎస్సైపై జరిగిన దాడి ఘటన స్థానికంగా సంచలనంగా మారింది.
ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్య సాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలో అక్రమ మద్యం వ్యాపారులు ఏకంగా పోలీసు అధికారిణిపైనే దాడి చేశారు. ఆగలి మహిళా ఎస్సై పై జరిగిన దాడి సంచలనంగా మారింది. అగలి మండలం ఇరిగేపల్లి గ్రామంలో కర్ణాటక మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో ఎస్సై శోభారాణి స్థానిక హోటల్లో తనిఖీ చేపట్టారు.
woman sub-inspector |పైన హోటల్.. లోన బెల్ట్ షాప్..
ఈ తనిఖీల్లో అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టయింది. పైకి హోటల్గానే ఉన్నా.. లోపల బెల్ట్ షాప్ నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో మద్యం సీజ్ చేసిన ఎస్సై శోభారాణి.. నిందితులైన తండ్రి మల్లికార్జున్, కూతురు కీర్తనను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను ఠాణాకు తరలించే క్రమంలో ఎస్సై శోభారాణితో మల్లికార్జున్, కీర్తన వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో శోభారాణి చెంపను కీర్తన చెళ్ళుమనిపించింది. దీనికితోడు మల్లికార్జున్ సైతం ఎస్సై శోభారాణిపై దాడికి యత్నించాడు. అప్రమత్తమైన కానిస్టేబుల్స్.. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.