అక్షరటుడే, వెబ్‌డెస్క్: IT Employees | ప్రముఖ ఐటీ దిగ్గజం విప్రోపై నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) తీవ్ర ఆరోపణలు చేసింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా ఎంపికైన 250 మందికి పైగా ఫ్రెషర్లను నెలల తరబడి ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ఆలస్యం చేస్తోందని పేర్కొంటూ కేంద్ర కార్మిక శాఖ మంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లింది.
ఈ మేరకు ‘నైట్స్’ అధ్యక్షుడు హర్‌ప్రీత్ సింగ్ సలూజా (Harpreet Singh Saluja) అధికారికంగా లేఖ రాశారు. నైట్స్ వివరాల ప్రకారం, దేశంలోని పలు రాష్ట్రాల కళాశాలల నుంచి విప్రో క్యాంపస్ నియామకాల ద్వారా వందలాది అభ్యర్థులను ఎంపిక చేసింది. వారందరికీ ఆఫర్ లెటర్లు జారీ చేయడమే కాకుండా, ఉద్యోగంలో చేరాల్సిన తేదీలు, ప్రదేశాలతో కూడిన కన్ఫర్మేషన్ ఈ-మెయిల్స్ కూడా పంపింది.
IT Employees | విప్రో ఇలా చేస్తుందేంటి..
బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ (Background Verification) వంటి అన్ని నియామక ప్రక్రియలు పూర్తయినప్పటికీ, గత ఆరు నుంచి ఎనిమిది నెలలుగా ఈ అభ్యర్థులకు ఆన్‌బోర్డింగ్ తేదీలు ఖరారు చేయలేదని నైట్స్ ఆరోపించింది. ఈ అంశంపై పలుమార్లు అభ్యర్థులు కంపెనీని సంప్రదించినా, సరైన సమాధానం లభించలేదని పేర్కొంది. కొన్నిసార్లు ‘వ్యాపార అవసరాల కారణంగా ఆలస్యం’ అంటూ ఆటోమేటెడ్ మెయిల్స్ మాత్రమే వస్తున్నాయని, దీంతో అభ్యర్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని నైట్స్ తన లేఖలో వివరించింది. ఇదే సమయంలో విప్రో ఇతర నియామకాలను కొనసాగిస్తుండటం, ఎంపికైన ఈ 250 మందిని మాత్రం అనిశ్చితిలో ఉంచడం అన్యాయమని హర్‌ప్రీత్ సింగ్ సలూజా విమర్శించారు.
ముఖ్యంగా ఆఫర్ లెటర్లలో నియామకాన్ని నిరవధికంగా వాయిదా వేసే అధికారం కంపెనీకి ఉంటుందనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనలేదని ఆయన తెలియజేశారు. ఇది పారదర్శకత లేమిని సూచిస్తోందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వంటి పలు రాష్ట్రాల నుంచి బాధిత అభ్యర్థులు నైట్స్‌ను ఆశ్రయించారని, ఇది ఒంటరి ఘటన కాదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర కార్మిక శాఖ తక్షణమే జోక్యం చేసుకోవాలని నైట్స్ కోరింది. నియామకాల జాప్యంపై విప్రో నుంచి వివరణ కోరాలని, అలాగే ప్రభావిత అభ్యర్థులందరికీ ఒక నిర్దిష్ట గడువులోగా ఆన్‌బోర్డింగ్ తేదీలు ప్రకటించేలా లేదా స్పష్టమైన కారణాలతో రాతపూర్వక నిర్ణయాన్ని తెలియజేయాలని సంస్థను ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది.