అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Party defections | ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం ఎటూ తేలడం లేదు. నోటీసుల దశ దాటి విచారణ (investigation) ముందుకు సాగడం లేదు. ఇప్పట్లో తేలే పరిస్థితి కూడా కనిపించడం లేదు. సుప్రీంకోర్టు (Supreme Court) విధించిన గడువు సమీపిస్తున్న తరుణంలో సభాపతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.
కోర్టు ఆదేశాల మేరకు వేటు వేయక తప్పదని బీఆర్ఎస్ పార్టీ (BRS party) చెబుతుంటే, అలాంటిదేమీ ఉండదని అధికార కాంగ్రెస్ చెబుతోంది. ఫిరాయింపులపై నిర్దిష్టిమైన విధివిధానాలు లేవని సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తరుణంలో పది మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఇప్పట్లో తేలే పరిస్థితి కనిపించడం లేదు.
Party defections | బీఆర్ఎస్ పోరాటం..
గత అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) బీఆర్ఎస్ పార్టీ టికెట్ పై పోటీ చేసిన గెలుపొందిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమని చెబుతూ అధికార పార్టీ గూటికి చేరారు. అయితే, గతంలో భారీగా ఫిరాయింపులను ప్రోత్సహించిన బీఆర్ఎస్ పార్టీ.. తాజాగా గోడ దూకిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని పోరాటం చేస్తోంది.
పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టిన ఉద్యమ పార్టీ.. ఇప్పుడు ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ పదేళ్లు పాలించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. నెలలు గడుస్తున్నా స్పీకర్ ఫిరాయింపుల ఫిర్యాదులపై (Speaker defection complaints) తేల్చకపోవడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. మూడు నెలల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సభాపతికి నిర్దేశిత గడువు విధించింది.
Party defections | నోటీసులతోనే సరి..
బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే వరకు స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ (Speaker Gaddam Prasad Kumar) ఫిరాయింపు ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అయితే, గులాబీ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హుటాహుటిన నోటీసులు జారీ చేశారు. దీన్ని గుర్తించిన న్యాయస్థానం వీలైనంత త్వరగా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు సభాపతి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఫిరాయింపు ఫిర్యాదులపై సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.
Party defections | విస్మయపరిచేలా వింత సమాధానాలు..
సభాపతి ఆదేశాలతో శాసనసభ్యులు తమ వివరణ సమర్పించారు. ఒక్కో ఎమ్మెల్యే ఇచ్చిన సమాధానాలు ఒక్కో రకంగా ఉన్నాయి. విస్మయం కలిగించే రీతిలో ఉన్న వివరణలు చూసి రాజకీయ పక్షాలు కంగుతిన్నాయి. ఒకరేమో తాను పార్టీ మారలేదని, సీఎంను కలిస్తే పార్టీ మారినట్లా అని ప్రశ్నిస్తుంటే, మరొకరేమో కండువా కప్పుకున్నంత మాత్రానా ఫిరాయించినట్లా? అని పేర్కొనడం విస్మయానికి గురిచేస్తోంది.
ఇంకొకరేమే తాను ఏ పార్టీలో ఉన్నదే తనకు తెలియనది చెబుతుంటే, మరొకరు మూడు రంగుల కండువా ఏమైనా కాంగ్రెస్ పార్టీ సొంతమా? అనే దబాయిస్తుండడం దిగజారిన రాజకీయాలకు అద్దం పడుతోంది. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము కాంగ్రెస్ పార్టీలో (Congress party) చేరామని చెప్పిన వీడియోలు ఉన్నప్పటికీ, తాము ఇంకా బీఆర్ ఎస్ లోనే కొనసాగుతున్నామని, తమ గౌరవ వేతనం నుంచి నెలనెల రూ.5 వేలు గులాబీ పార్టీ నిధికి జమ అవుతోందని చెబుతుండడం.. పదవిని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు పడుతున్న ఆపసోపాలకు నిదర్శనంగా నిలుస్తోంది.
Party defections | చర్యలుంటాయా?
ఫిరాయింపుల అంశంపై ఇటీవల ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు దారి తీశాయి. ఢిల్లీలో చిట్‌చాట్‌గా మాట్లాడిన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy).. ఫిరాయింపుల విషయంలో నిర్దిష్ట విధివిధానాలు లేవని తెలిపారు. అయినా, కండువా కప్పినంత మాత్రాన పార్టీ మారినట్లేనా? అని ప్రశ్నించారు. సీఎం వ్యాఖ్యలను బట్టి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉండకపోవచ్చన్న భావన నెలకొంది.
ఇద్దరు ఎమ్మెల్యేలు మినహా మిగతా వారి విషయంలో స్పీకర్ చర్యలు చేపట్టకపోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. పరిస్థితులు ప్రతికూలంగా ఉన్న తరుణంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్వచ్ఛందంగా రాజీనామా చేస్తారని తెలిసింది. అయితే, ఫిరాయింపులపై బీఆర్ఎస్ బలంగా వాదనలు వినిపిస్తుండడంతో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.