అక్షరటుడే, వెబ్డెస్క్: Rythu Bharosa | రైతు భరోసా కోసం అన్నదాతలు నిరీక్షిస్తున్నారు. యాసంగి సీజన్ (Yasangi season) సగం గడిచినా ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
రాష్ట్రంలో బీఆర్ఎస్ హయాంలో రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేలు జమ చేసేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చారు. ఎకరాకు రూ.6 వేల చొప్పున అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం యాసంగి వరి నాట్లు చాలా జిల్లాల్లో పూర్తయ్యాయి. అయినా ఇప్పటి వరకు రైతు భరోసా (Rythu Bharosa) ఎప్పుడు జమ చేస్తామనే విషయంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో మున్సిపల్ ఎన్నికల షెడ్యుల్ విడుదలయ్యే అవకాశం ఉంది. దీంతో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుంది. ఆ లోపు రైతు భరోసా వేస్తారా లేదా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Rythu Bharosa | సాగు భూములకే..
సాగు భూములకు మాత్రమే యాసంగిలో రైతు భరోసా జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala Nageswara Rao) తెలిపారు. సంక్రాంతిలోపు సర్వే చేసి నిధులు విడుదల చేస్తామన్నారు. అయితే పండుగ అయిపోయినా రైతు భరోసా పత్తాకు లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పెట్టుబడికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఓ సీజన్లో రైతు భరోసా జమ చేయలేదు. మరో సీజన్లో నాలుగు ఎకరాలలోపు వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి. దీంతో ఇప్పుడు కూడా డబ్బులు వస్తాయా.. రావా అని అన్నదాతలు చర్చించుకుంటున్నారు.
Rythu Bharosa | వానాకాలంలో వేగంగా..
వానాకాలం సీజన్లో ప్రభుత్వం రైతు భరోసాను వేగంగా జమ చేసింది. సీజన్ ప్రారంభం కాగానే.. తొమ్మిది రోజుల్లో రైతుల ఖాతాల్లో రూ.9 వేల కోట్లు వేసింది. అయితే ఆ సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో నిధులు విడుదల చేసిందనే ప్రచారం జరిగింది. అయితే బీసీ రిజర్వేషన్, కోర్టు కేసులతో ఎన్నికలు ఆలస్యం అయ్యాయి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో డబ్బులు జమ చేస్తారని అనుకుంటున్నారు. ఆదివారం మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రైతు భరోసాపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. త్వరగా పెట్టుబడి సాయం అందించాలని అన్నదాతలు కోరుతున్నారు.