అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Danam Nagender | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. వారి అనర్హత పిటిషన్లపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు (Supreme Court) త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జులై 31న సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. అక్టోబర్ 31తో ఆ గడువు ముగిసింది. అయినా స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనిపై బీఆర్ఎస్ (BRS) మరోసారి కోర్టును ఆశ్రయించగా.. స్పీకర్ తీరుపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హతపై చర్యలు తీసుకుంటారా.. తమను తీసుకోమంటారా అని ప్రశ్నించింది. నాలుగు వారాల్లో చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ఈ క్రమంలో స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారణలో వేగం పెంచారు.
Danam Nagender | 8 మంది ఎమ్మెల్యేల విచారణ
స్పీకర్ ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేలను విచారించారు. స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ (Danam Nagender) మాత్రం విచారణకు ఇంకా హాజరు కాలేదు. ఈ క్రమంలో ఈ నెల 23న హాజరు కావాలని స్పీకర్ ఇద్దరికి నోటీసులు జారీ చేశారు. దీంతో కడియం శ్రీహరి శుక్రవారం స్పీకర్‌ను కలిశారు. వివరణ ఇవ్వడానికి మరింత సమయం కావాలని ఆయన కోరారు. కడియం లేఖపై స్పీకర్ సానుకూలంగా స్పందించారు.
Danam Nagender | దానం ఏం చేస్తారో..
ఇప్పటి వరకు విచారణకు హాజరైన 8 మంది ఎమ్మెల్యేలు తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని చెప్పినట్లు తెలిసింది. అయితే కడియం శ్రీహరి (Kadiyam Srihari) కూతురు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. ఆమె తరఫున కడియం ప్రచారం చేశారు. అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి ఆయన సాంకేతిక కారణాలు అన్వేషిస్తున్నట్లు సమాచారం. దీంతోనే ఇప్పటి వరకు విచారణకు హాజరు కాలేదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఆయనపై వేటు తప్పదనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే దానం ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. త్వరలోనే ఆయన రాజీనామా చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దానం ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక స్పీకర్‌ను కలిసే అవకాశం ఉంది.
Danam Nagender | కేటీఆర్ ఏమన్నారంటే..
అనర్హత పిటిషన్లపై కేటీఆర్ (KTR) శుక్రవారం మాట్లాడారు. సాంకేతిక కారణాలతో కడియం శ్రీహరిని కాపాడి దానం నాగేందర్‌తో రాజీనామా చేయించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. త్వరలో ఖైరతాబాద్‌లో ఉప ఎన్నికలు వస్తాయని ఆయన అన్నారు. ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు (GHMC Elections) వస్తాయని, అనంతరం ఉప ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. దానం కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేసి దొరికిపోయారన్నారు. అనర్హత వేటు పడితే పరువు పోతుందని ముందుగానే రాజీనామా చేయించాలని చూస్తున్నారని చెప్పారు.
