అక్షర టుడే, వెబ్‌డెస్క్: Nobel Prize | నోబెల్ శాంతి బహుమతి పొందాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) కలలు కల్లలయ్యాయి. వెనిజులాకు చెందిన ప్రతిపక్ష నేత మారియా కొరినా మచాడోను నోబెల్ పీస్ ప్రైజ్ వరించింది.
ఈ నేపథ్యంలో నార్వేజియన్ నోబెల్ కమిటీపై వైట్ హౌస్ (White House) తీవ్ర విమర్శలు గుప్పించింది. రాజకీయ వివక్ష చూపించారని ఆరోపించింది. నోబెల్ ప్రైజ్ రాకపోయినప్పటికీ అగ్రరాజ్య అధ్యక్షుడు శాంతి ఒప్పందాలు కుదర్చడం, యుద్ధాలను ముగించడం, అమాయకుల ప్రాణాలను కాపాడటం కొనసాగిస్తారని పేర్కొంది.
Nobel Prize | రాజకీయాలను ముందుంచుతారు..
అధ్యక్షుడు ట్రంప్ కు నోబెల్ బహుమతి ఇవ్వకపోవడాన్ని వైట్ హౌస్ ప్రతినిధి స్టీవెన్ చియుంగ్ తప్పుబట్టారు. నోబెల్ కమిటీ రాజకీయ వివక్ష చూపించిందని మండిపడ్డారు. నోబెల్ కమిటీ శాంతి స్థాపన కంటే రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చిందని ఆరోపించారు. ప్రపంచ శాంతి (world peace) కోసం నిజమైన నిబద్ధత చూపిన వారిని పక్కన పెట్టి రాజకీయ వివక్ష ప్రదర్శించిందన్నారు.
అయినప్పటికీ ట్రంప్ ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తారని, యుద్ధాలను నివారించి అమాయకుల ప్రాణాలను కాపాడుతారని తెలిపారు. “అధ్యక్షుడు ట్రంప్ శాంతి ఒప్పందాలు కుదర్చడం, యుద్ధాలను ముగించడం, ప్రజల ప్రాణాలను కాపాడటం కొనసాగిస్తారు. ఆయన మానవతావాది. అధ్యక్షుడికి హృదయం ఉంది. ఆయనలాంటి వారు తన సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించగలరని” ఆయన Xలో పోస్టు చేశారు.
Nobel Prize | మరియాకు నోబెల్ బహుమతి
2025 నోబెల్ శాంతి బహుమతికి వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు మరియా కోరినా మచాడో (Maria Corina Machado) ఎంపికయ్యారు. ఈ మేరకు జోర్గెన్ వాట్నే ఫ్రైడ్నెస్ ప్రాతినిధ్యం వహిస్తున్న నార్వేజియన్ నోబెల్ కమిటీ ఆమెకు అవార్డును ప్రకటించింది. సవాలుతో కూడిన సమయాల్లో “ప్రజాస్వామ్య జ్వాల”ను సజీవంగా ఉంచినందుకు వెనిజులా ప్రతిపక్ష నాయకురాలని కమిటీ ప్రశంసించింది.
అక్టోబర్ 7, 1967న జన్మించిన మచాడో.. మానవ హక్కుల (human rights) ఉల్లంఘనలను పాల్పడుతున్న వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. దేశంలో ప్రజాస్వామ్యం, శాంతి స్థాపన కోసం అలుపెరుగని పోరాటం చేశారు. ఎన్నికల పారదర్శకతను ప్రోత్సహించడంపై దృష్టి సారించిన పౌర సంస్థ సుమాటేను సహ-స్థాపించడం ద్వారా మచాడో 2002లో తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు.
2011 నుంచి 2014 వరకు జాతీయ అసెంబ్లీ సభ్యురాలిగా పనిచేశారు. 2013లో ఉదారవాద, ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న వెంటే వెనిజులా అనే రాజకీయ పార్టీని స్థాపించారు. తన కెరీర్ మొత్తంలో, మచాడో మానవ హక్కుల కోసం ఉద్యమించారు. వెనిజులాలో నిరంకుశ పాలనను సవాలు చేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి.