అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bill Gates | మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం బిల్ గేట్స్ కృత్రిమ మేధస్సుపై ప్రపంచ దేశాలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాబోయే కొద్ది సంవత్సరాల్లోనే ఏఐ ప్రభావంతో ఉద్యోగ మార్కెట్‌లో, ముఖ్యంగా వైట్ కాలర్ రంగంలో ఊహించని స్థాయిలో మార్పులు చోటు చేసుకుంటాయని ఆయన అన్నారు.
ఈ పెను మార్పులను ఎదుర్కొనేందుకు చాలా దేశాల ప్రభుత్వాలు ఇప్పటికీ సరైన సన్నాహాలు చేయలేదని గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (World Economic Forum) సదస్సు సందర్భంగా ఎన్డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బిల్ గేట్స్ ఈ విషయాలను వెల్లడించారు.
Bill Gates | గత విప్లవాల కంటే వేగంగా ఏఐ ప్రభావం
రాబోయే నాలుగు నుంచి ఐదు ఏళ్లలో వైట్ కాలర్‌తో పాటు బ్లూ కాలర్ ఉద్యోగాల్లోనూ భారీ మార్పులు రానున్నాయి. టెక్నాలజీ వల్ల పెరుగుతున్న అసమానతలను తగ్గించాలంటే ప్రభుత్వాలు ఇప్పుడే ముందడుగు వేయాలి” అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏఐ (Artificial Intelligence) ప్రభావం కొంత పరిమితంగానే కనిపిస్తున్నా, ఇది ఎక్కువ కాలం ఇలాగే ఉండదని హెచ్చరించారు. గతంలో వచ్చిన సాంకేతిక విప్లవాలతో పోలిస్తే, ఏఐ చాలా వేగంగా, లోతుగా సమాజంలోకి చొచ్చుకుపోతుందని గేట్స్ తెలిపారు. విద్య, వైద్యం వంటి రంగాల్లో ఏఐ అనేక లాభాలను అందించగలదని ఆయన అంగీకరించారు. అయితే ఉద్యోగ నియామకాలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక సమానత్వంపై ఏఐ చూపే ప్రభావాన్ని సరైన విధంగా నియంత్రించకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.
ఏఐ వల్ల వచ్చే మార్పులను సమర్థంగా ఎదుర్కోవాలంటే ప్రభుత్వాలు కింది అంశాలపై దృష్టి పెట్టాలని బిల్ గేట్స్ సూచించారు. ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ (Reskilling, Upskilling) కల్పించడం, మారుతున్న ఉద్యోగ మార్కెట్‌కు అనుగుణంగా విద్యా విధానాలను మార్చడం, పన్నుల విధానాల్లో సంస్కరణలు తీసుకురావడం, ఆర్థిక అసమానతలు పెరగకుండా సామాజిక భద్రతా చర్యలు బలోపేతం చేయడం వంటివి చేయాలి. మారుతున్న ప్రపంచ రాజకీయ, ఆర్థిక పరిస్థితుల్లో భారత్–అమెరికా (India-America) భాగస్వామ్యం అత్యంత నమ్మకమైన శక్తిగా నిలుస్తుందని గేట్స్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా భారత్ వేగంగా అభివృద్ధి చేస్తున్న డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ టెక్నాలజీని త్వరగా అందిపుచ్చుకోవడం దేశానికి పెద్ద ప్లస్ పాయింట్ అని కొనియాడారు.