అక్షరటుడే, వెబ్డెస్క్ : Ponnam Prabhakar | అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ (Hyderabad ) కలెక్టరేట్లో ఆయన వివిధ శాఖల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమీక్షించారు.
అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేలా సమన్వయంతో పనిచేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. నగరంలో జనాభా పెరుగుదల, వలసలు, సేవా ఆధారిత ఆర్థిక వ్యవస్థను పరిగణనలోకి తీసుకుని, విద్య, ఆరోగ్య సంరక్షణ, గృహనిర్మాణం, రవాణా, భద్రత, ప్రజా సేవలపై దృష్టి సారించాలన్నారు. పట్టణ రవాణా, రోడ్డు భద్రత, RTC కనెక్టివిటీ, కొత్త బస్సు మార్గాలు, మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, EV ప్రమోషన్ & ఛార్జింగ్ మౌలిక సదుపాయాలు వంటి అంశాలపై ఆయన చర్చించారు.
Ponnam Prabhakar | విద్యారంగానికి ప్రాధాన్యం
ప్రభుత్వం విద్యారంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ప్రవేశాల కోసం విడుదల చేసిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో TGMREIS కీలక పాత్ర పోషిస్తున్నదని అన్నారు. ఐదో తరగతి నుంచి 8వ తరగతి వరకు మైనారిటీ విద్యార్థుల కోసం ప్రవేశాలు ప్రారంభించామని తెలిపారు.
Ponnam Prabhakar | ఉచిత విద్య
TGMREIS ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత విద్య, పుస్తకాలు, వసతి, భోజనం అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 205 పాఠశాలలు, జూనియర్ కళాశాలల ఉన్నాయన్నారు. మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.