Different weather condition : తెలంగాణలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు మండిపోతుంటేమరోవైపు వానలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం వరకు తీవ్ర ఎండవేడిమి, ఉక్కపోత ఉండగా, సాయంత్రం కాగానే చల్లని గాలులు, చిరుజల్లులు పడుతున్నాయి. ఈదురుగాలులు దుమారం రేపుతున్నాయి. భిన్నమైన వాతావరణ పరిస్థితులతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
Weather | 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు..
ఈ వేసవి కాలం ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో సుమారు 45 డిగ్రీల ఉష్ణోగత్రలు నమోదయ్యాయి. నిజామాబాద్, రామగుండం, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో సగటు కంటే నాలుగైదు, డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండ వేడిమికి ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. పగటిపూట రోడ్లన్నీ నిర్మాణుష్యంగా మారుతున్నాయి. వేడిగాలులు, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం అకాల వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇప్పటికీ 42 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏసీలు, కూలర్ల వాడకం పెరగడంతో విద్యుత్ వినియోగం కూడా భారీగా పెరిగింది.
Weather | అకాల వర్షాలు..
రాష్ట్రంలో ఓ వైపు మండుతున్న ఎండలతో జనం ఉక్కిరి బిక్కిరి అవుతుంటే, మరోవైపు ఈదురు గాలులతో కూడిన అకాల వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సోమవారం సాయంత్రం నిజామాబాద్ సహా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. నిజామాబాద్‌లో గంటకు పైగా వర్షం పడగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మార్కెట్‌యార్డులో విక్రయాల కోసం తీసుకొచ్చిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. హైదరాబాద్‌లో కురిసిన వర్షానికి గంటల కొద్దీ రాకపోకలు ఆలస్యమయ్యాయి. జగిత్యాల జిల్లాలో వడగళ్ల వాన కురిసింది. మధ్యాహ్నం దాకా ఉక్కపోతతో అల్లాడిన జనానికి సాయంత్రం కురిసిన వర్షం సాంత్వన చేకూర్చింది.
Weather | ఆరోగ్యం జాగ్రత్త..
రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులు అనువైనవి కావని వైద్యులు చెబుతున్నారు. విపరీతమైన ఎండతో పాటు చల్లని గాలులు ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతాయని తెలిపారు. ప్రధానంగా పిల్లలు, వృద్ధులు ఈ పరిస్థితిని తట్టుకోలేని, వారిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు. ఎక్కువగా నీళ్లు తాగించడంతో పాటు పౌష్టికాహారం అందించాలని, నీరసపడకుండా ఎలక్ట్రోరల్ పౌడర్ వాడాలని చెబుతున్నారు.
Weather | నేడు, రేపు వర్షసూచన
తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధ వారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, పెద్దపల్లి, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగాం, యాదాద్రి, నల్గొండ, గద్వాల, వనపర్తి, నారాయణపేట, సూర్యాపేట జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదరుగాలులతో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.