అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Weather Updates | బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాన్ (Cyclone Ditwah) బలహీనపడి వాయుగుండంగా మారింది. ఇది మరింత బలహీన పడనుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.నైరుతి బంగాళాఖాతంలో ఇటీవల దిత్వా తుపాన్ ఏర్పడిన విషయం తెలిసిందే.
దీని ప్రభావంతో తమిళనాడు (Tamil Nadu), ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఇది బలహీన పడటంతో ముప్పు తప్పింది. అయితే రానున్న రెండు రోజులు ఆంధ్ర ప్రదేశ్ (Andhra Pradesh)లోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నెల్లూరు, తిరుపతిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వాయుగుండం ఎఫెక్ట్‌తో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీస్తాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. దక్షిణ కోస్తా పోర్టుల్లో మూడో నెంబర్ హెచ్చరిక జారీ చేశారు. ఉత్తర కోస్తాలోని పోర్టుల్లో ఒకటో నెంబర్ హెచ్చరిక కొనసాగుతోంది.
Weather Updates | తెలంగాణలో..
తెలంగాణ (Telangana)లో పలు జిల్లాల్లో బుధవారం నుంచి మూడు రోజుల పాటు జల్లులు కురిసే అవకాశం ఉంది. దక్షిణ తెలంగాణ జిల్లాలకు వర్ష సూచన ఉంది. ఈ నెల 6, 7 తేదీల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. డిసెంబర్ 9 తర్వాత చలి తీవ్రత పెరగనుంది. దీంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కాగా దిత్వా తుపాన్ కారణంగా శ్రీలంకలో ఎంతో మంది చనిపోయారు. వందలాది ఇళ్లు ధ్వంసం అయ్యాయి. తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy Rains) ముంచెత్తాయి. ఈ తుపాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
