అక్షరటుడే, వెబ్డెస్క్ : Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని సరూర్ నగర్ చెరువును పునరుద్ధరిస్తామని హైడ్రా కమిషనర్ (Hydraa Commissioner) రంగనాథ్ తెలిపారు. బుధవారం ఆయన చెరువును పరిశీలించారు.
హైదరాబాద్ నగరంలో చెరువుల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు హైడ్రా అధికారులు చెరువులు, నాలాలు, పార్కులను కబ్జాల నుంచి కాపాడుతున్నారు. అలాగే నగరంలోని పలు చెరువులకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారు. ఇప్పటికే బతుకమ్మ కుంటను అభివృద్ధి చేసి ప్రారంభించారు. ప్రస్తుతం కూకట్పల్లి నల్ల చెరువు (Nalla cheruvu), పాతబస్తీలోని మరో చెరువు సహా ఆరు చెరువులను హైడ్రా పునరుద్ధరిస్తోంది. ఇందులో మూడు చెరువుల పనులు అయిపోయాయి. మరికొన్ని చెరువులను పునరుద్ధరించేందుకు హైడ్రా సిద్ధమైది.
Hydraa | త్వరలో పనులు
సరూర్ నగరల్ చెరువు పనులు త్వరలోనే చేపడతామని కమిషనర్ తెలిపారు. 140 ఎకరాలకు పైగా ఉన్న చెరువు పరిధిలో చాలా వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టారన్నారు. ప్రస్తుతం వాటికి జోలికి వెళ్లడం లేదని చెప్పారు. 90 ఎకరాలకు పైగా మిగిలి ఉన్న చెరువునే అభివృద్ధి చేస్తామన్నారు. చెరువులో 10 నుంచి 15 అడుగుల మేర పూడికను తొలగించి లోతు పెంచుతామన్నారు. దీంతో నీటి నిలువ సామర్థ్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు సైతం పెరుగుతాయన్నారు. వరదల నియంత్రణకు చెరువు ఉపయోగపడేలా మారుస్తామని ఆయన పేర్కొన్నారు.
కాగా హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం పడ్డ రోడ్లన్ని జలమయం అవుతున్నాయి. కాలనీల్లోకి వరద నీరు చేరుతోంది. హైడ్రా అన్ని చెరువులను పునరుద్ధరిస్తే వరద సమస్య పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. నాలాల ఆక్రమణలపై సైతం హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.