అక్షరటుడే, వెబ్డెస్క్: Minister Seethakka | రాష్ట్రంలో జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపడుతామని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. దీంతో పలు జిల్లాలు రద్దు అవుతాయని ప్రచారం జరుగుతోంది.
ములుగు జిల్లాను రద్దు చేస్తారని వార్తలు రావడంపై మంత్రి సీతక్క (Minister Seethakka) స్పందించారు. మేడారంలో బుధవారం ఆమె పర్యటించారు. మేడారం మహా జాతరకు (Medaram Maha Jatara) సంబంధించి ఏర్పాట్ల పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ములుగు జిల్లా (Mulugu district) రద్దు అవుతుందనే ప్రచారాన్ని ఖండించారు. బీఆర్ఎస్ హయంలో జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా జరిగిందన్నారు. పాలనా సౌలభ్యాన్ని పట్టించుకోకుండా, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా అస్తవ్యస్తంగా జిల్లాల సరిహద్దులను నిర్ణయించారని విమర్శించారు.
Minister Seethakka | ఒకే జిల్లాలో ఉండాలి
ఒక మండలం మొత్తం ఒకే జిల్లాలో ఉండాలన్నది ప్రజల కోరిక అని మంత్రి అన్నారు. అయితే ములుగు జిల్లాలోని ఒక మండలంలో ఐదు గ్రామాలు భూపాలపల్లి జిల్లాలో ఉంటాయన్నారు. అలాంటప్పుడు ప్రజలకు పాలనా ఫలాలు ఎలా అందుతాయని ఆమె ప్రశ్నించారు. రెవెన్యూ, పోలీసు సరిహద్దులు ఒకే లాగా ఉండాలన్నారు. ఆ విధానాన్ని కేసీఆర్ అవలంభించలేదని విమర్శించారు. దీంతో జిల్లాల సరిహద్దు గ్రామాల ప్రజలు రెండు జిల్లాల కలెక్టరేట్ల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే శాస్త్రీయ పద్ధతిలో జిల్లాల సరిహద్దు విషయంలో స్వల్ప మార్పులు ఉంటాయని సీఎం చెప్పారన్నారు.
ములుగు జిల్లా ఏర్పాటు నచ్చని వాళ్లే జిల్లా రద్దవుతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆందోళన చెందొద్దని ప్రజలకు సూచించారు. ములుగు జిల్లా అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందల కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. అలాంటప్పుడు జిల్లా రద్దు అనే ప్రశ్న ఉత్పన్నం కాదని చెప్పారు. ములుగు జిల్లా ఎక్కడికి పోదు.. ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశారు.