Homeజిల్లాలుకామారెడ్డిKamareddy | సాయి ఈశ్వర చారి త్యాగస్ఫూర్తితో ముందుకువెళ్తాం..

Kamareddy | సాయి ఈశ్వర చారి త్యాగస్ఫూర్తితో ముందుకువెళ్తాం..

బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర చారి చేసిన ప్రాణత్యాగం వృథా పోనివ్వమని జిల్లా స్వర్ణకార సంఘం, బీసీ జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణంలో ఇరు సంఘాల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | బీసీ రిజర్వేషన్ల కోసం సాయి ఈశ్వర చారి (Sai Ishwar Chari) చేసిన ప్రాణత్యాగం వృథా పోనివ్వమని జిల్లా స్వర్ణకార సంఘం, బీసీ జేఏసీ ప్రతినిధులు పేర్కొన్నారు. పట్టణంలో ఇరు సంఘాల ఆధ్వర్యంలో మహా ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని స్వర్ణకార సంఘం భవనం నుండి తిలక్ రోడ్డు, జేపీఎన్, సిరిసిల్లా రోడ్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా (Nizamsagar Chowrastha) వరకు పెద్ద ఎత్తున ఈ ర్యాలీ కొనసాగింది. అనంతరం నిజాంసాగర్ చౌరస్తా వద్ద మానవహారం నిర్వహించారు.

అక్కడి నుండి జ్యోతిబాపూలే విగ్రహం వరకు వెళ్లి ఆత్మ బలిదానం చేసుకున్న సాయికి నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. బీసీ రిజర్వేషన్ల (BC reservation) ఉద్యమానికి తన ప్రాణాన్నే త్యాగం చేసిన వీరుడు సాయి ఈశ్వర్ చారి అన్నారు. బీసీలకు అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని తట్టుకోలేక ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని బీసీ ఉద్యమానికి జ్వాల రగిల్చాడని.. ఇది ఆత్మహత్య కాదని, ఇది ముమ్మాటికీ కాంగ్రెస్, బీజేపీలు చేసిన హత్యేనని తెలిపారు.

అగ్రవర్ణ నాయకులైన రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), కిషన్ రెడ్డిలే దీనికి బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసిన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం, 9వ షెడ్యూల్లో చేర్చకుండా చోద్యం చూస్తున్న బీజేపీ కేంద్ర ప్రభుత్వం రెండు పార్టీలు బీసీ ద్రోహులేన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నాయకులు నీల నాగరాజు, కుంబాల లక్ష్మణ్ యాదవ్, స్వర్ణకార సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేపూరి వెంకటస్వామి, ఉపాధ్యక్షుడు రాజమౌళి, సలహాదారు బ్రహ్మం, పట్టణ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్, కోశాధికారి శేషు చారి తదితరులు పాల్గొన్నారు.

టీఆర్పీ ఆధ్వర్యంలో..

తెలంగాణ రాజ్యాధికార పార్టీ కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజాంసాగర్ చౌరస్తాలో శనివారం సాయి ఈశ్వర చారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సాయి ఈశ్వర చారి మరణం వృథా కాదన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ తాహెర్, టౌన్ ప్రెసిడెంట్ మామిళ్ల సిద్ధ రాములు, సెక్రటరీ కాశాగౌడ్, కళ్లెం రాజు, సామల వెంకటేశం, మహమ్మద్ ఫసియుద్దీన్​, సయ్యద్ జావిద్, కామ్లే బాలాజీ, సునీల్, రాజేందర్, శ్రీకాంత్, రమేష్, చందు, మాణిక్యం తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News