అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Global Summit | తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉత్సాహంగా సాగుతోంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Governor Jishnu Dev Verma) ఈ సదస్సును ప్రారంభించారు. వేలాది మంది అతిథులు హాజరయ్యారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ సదస్సు నిర్వహిస్తోంది.
సదస్సులో గవర్నర్ మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం అన్ని వర్గాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతోందని చెప్పారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. నోబెల్ బహుమతి గ్రహీత కైలాస్ సత్యార్థి మాట్లాడుతూ సీఎం రేవంత్ పాలనపై ప్రశంసలు కురిపించారు. అమెరికాకు చెందిన ట్రంప్ మీడియా, టెక్నాలజీ గ్రూప్ డైరెక్టర్ ఎరిక్ స్వైడర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించారు. రాబోయే 10 సంవత్సరాలలో ఫ్యూచర్ సిటీ, తెలంగాణలో రూ.లక్ష కోట్ల పెట్టుబడి పెడతామన్నారు.
పెట్టుబడులకు తెలంగాణ బెస్ట్ డెస్టినేషన్ అని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించేందుకు ఈ గ్లోబల్ సమ్మిట్ మైల్ స్టోన్‌గా నిలుస్తుందన్నారు. ఐటీ, ఫార్మా, ఏరోస్పెస్, పరిశ్రమల రంగాల్లో తెలంగాణ అద్భుతమైన ప్రగతి సాధిస్తోందని వెల్లడించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మాట్లాడారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 2047 వరకు వికసిత్ భారత్ లక్ష్యంగా పని చేస్తోందన్నారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తేనే ఇది సాధ్యమన్నారు.