ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిBC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తాం: పీసీసీ చీఫ్​

    BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తాం: పీసీసీ చీఫ్​

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: BC Declaration | బీసీ రిజర్వేషన్లు అమలయ్యాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని పీసీసీ చీఫ్​ బొమ్మ మహేష్​కుమార్​ గౌడ్​ (PCC Chief Bomma Mahesh Kumar Goud) పేర్కొన్నారు.

    బీసీ బిల్లు ఆమోదంపై బీజేపీ నేతల భాగోతాన్ని బయటపెట్టేందుకే కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు సభ నిర్వహిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని శుభం కన్వెన్షన్ హాలులో ఆదివారం నిర్వహించిన బీసీ బిల్లు సభ ఉమ్మడి జిల్లా ముఖ్య నాయకుల సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కామారెడ్డి పట్టణం భారీవర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొందని, సీఎం రేవంత్​రెడ్డితో (CM Revanth Reddy) పాటు తాను కూడా ఏరియల్ సర్వేకు వచ్చానని, వాతావరణం అనుకూలించక ఇక్కడ దిగలేకపోయామన్నారు. నాడు కామారెడ్డి వస్తున్నప్పుడు సీఎం తనతో పీసీసీ చీఫ్ పదవి చేపట్టి ఎన్ని రోజులైందని అడిగారని, ఈనెల 15తో ఏడాది అవుతుందని చెప్పానన్నారు. దాంతో అదే రోజు కామారెడ్డిలో బీసీ రిజర్వేషన్ అమలుపై సంబరాలు జరిపేందుకు సభ నిర్వహిద్దామని నిర్ణయించారని గుర్తు చేశారు.

    BC Declaration | రాహుల్​గాంధీ ఈ దేశ భవిష్యత్తు..

    రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈదేశ భవిష్యత్తు అని తెలిపారు. ఈ దేశ జనాభాలో ఏ వర్గం ఎంత శాతం ఉంటారో అంతే శాతం ఫలాలు వారికి అందాలని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. ఇప్పుడు ఇదే విధానంపై దేశమంతా ఉద్యమం నడుస్తుందని ఆ ఉద్యమానికి ఊపిరి పోసింది సీఎం రేవంత్ రెడ్డి అని తెలిపారు. 1930 తర్వాత కుల సర్వే జరిగింది తెలంగాణలో మాత్రమేనన్నారు. కులసర్వేలో బీసీలు 56.33 శాతం, ఎస్టీలు 15శాతం, ఎస్సీలు 10.20 శాతం, అగ్రవర్ణాలు 10-15 శాతం ఉన్నట్టు తేలిందన్నారు.

    BC Declaration | కామారెడ్డిలోని డిక్లరేషన్​కు పునాది..

    బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కామారెడ్డి వేదికగా బీసీ డిక్లరేషన్ చేసింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో బీసీలు కాకుండా ఇతర నాయకులు ఉన్నా బీసీ రిజర్వేషన్​కు మద్దతు తెలిపారని, అది కాంగ్రెస్ పార్టీ సిద్దాంతమని పేర్కొన్నారు. ఆ మాట నిలబెట్టుకునేలా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించడంతో పాటు విద్య, ఉపాధిలో 42 శాతం కల్పిస్తూ తీర్మానం చేసిందన్నారు.

    BC Declaration | దేవుడి పేరుతో బీజేపీ ఓట్లు అడుక్కుంటోంది..

    బీసీ బిల్లు చట్టం కాకుండా బీజేపీ నాయకులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. బీసీ బిల్లును (BC Bill) అడ్డుకుంటున్న నాయకుల భరతం పట్టడానికి, వారి బాగోతం బయట పెట్టడానికే కామారెడ్డి సభ నిర్వహిస్తున్నామన్నారు. లక్షల మంది సభకు వచ్చి బండి సంజయ్, కిషన్ రెడ్డి (MP Kishan Reddy) బాగోతాలకు తెర దించుతారని తెలిపారు. బీజేపీ నాయకులంటే దేవుడి పేరుతో ఓట్లడుక్కునే బిచ్చగాళ్లని తాను గతంలోనే చెప్పినట్టు గుర్తు చేశారు. దేవుడి పేరు లేనిదే వాళ్లకు ఓట్లు రాలవన్నారు.

    ఏనాడైనా బండి సంజయ్ (MP Bandi Sanjay) సికింద్రాబాద్​లో పరిశ్రమ పేరుతో.. అంబర్​పేట్​లో పనులు చేయించాననే పేరుతో ఓట్లు అడిగే దమ్ము ఉందా అని పీసీసీ చీఫ్​ ప్రశ్నించారు. శ్రీరాముడు, శివుడు, ఆంజనేయుని పేర్లతో తప్ప ఓట్లడిగే పరిస్థితి లేదన్నారు. తెల్లారి లేస్తే కరీంనగర్ గుడుల చుట్టూ తిరిగి ఓట్లడుక్కుంటాడాని విమర్శించారు. తాము కూడా పూజలు చేస్తామని, ఏనాడు దేవుని పేరుతో ఓట్లడగలేదన్నారు.

    BC Declaration | కాంగ్రెస్​ సిద్ధాంతం మాటమీద నిలబడడం..

    తమ సిద్దాంతం చెప్పిన మాట మీద ఉండటం.. చేసిన పని మీద ఓట్లడగడం అని బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ అన్నారు. అందుకే చొప్పదండి సభలో ఆరు గ్యారెంటీలపై హామీ ఇస్తే ప్రజలు గెలిపించారని తెలిపారు. ‘‘బండి సంజయ్ క్షేత్రస్థాయిలోకి రా.. ఇద్దరం కూడా సెక్యూరిటీ వదిలి జనాల్లో తిరుగుదాం. ప్రజలు ఎవరిని గుర్తిస్తారో చూద్దామని’’ సవాల్ విసిరారు. పనికిమాలిన మాటలు చెప్పి ఇంకా ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

    రెడ్డి వర్గానికి చెందిన సీఎం బీసీ రిజర్వేషన్ కోసం ఎంతగా తపిస్తున్నారో మంత్రివర్గ సభ్యులకు తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమాట ఇచ్చినా అది అందరికీ శిరోదార్యమన్నారు. ఇవాళ మోదీని పట్టుకుని బిల్లు మరొక మూడేళ్లు ఆపుతారేమో.. ఆ తర్వాత ప్రధాని రాహుల్​గాంధీ అని స్పష్టం చేశారు. తాత్కాలికంగా మాత్రమే బిల్లును ఆపగలరని పేర్కొన్నారు.

    BC Declaration | బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తాం..

    బీసీలకు 42శాతం రిజర్వేషన్ ఇస్తామని, బీజేపీ వ్యవహారం, దొంగవైఖరిని 15న జరిగే కామారెడ్డి సభలో యావత్ తెలంగాణకు తెలియజేస్తామన్నారు. బండి సంజయ్, అర్వింద్​, ఈటల రాజేందర్​ బిల్లు ఆమోదం కోసం ఎందుకు ప్రయత్నించడం లేదన్నారు. బండి సంజయ్​కి తాను ఛాలెంజ్ చేస్తున్నానని, నిజంగా బీసీ పౌరుషం ఉంటే తాము చేసిన తీర్మానాన్ని చట్టబద్ధం చేయాలన్నారు. బీజేపీ తలుచుకుంటే ఒకేరోజు బిల్లుకు చట్టబద్ధత వస్తుందన్నారు. ప్రధాని మోదీ పుట్టుకతో బీసీ కాదని, అందుకే ఆయనకు బీసీలపై ప్రేమ లేదన్నారు. అందుకే కేంద్రంపై శంఖారావం పూరించేలా కామారెడ్డి సభలో సమరభేరి మోగిస్తామన్నారు.

    BC Declaration | లిక్కర్​ రాణిగా జిల్లాకు చెడ్డపేరు తెచ్చారు

    జిల్లాకు కోడలిగా కవితను అభిమానిస్తామని, కాని లిక్కర్​రాణిగా జిల్లాకు ఆమె చెడ్డపేరు తెచ్చారని పీసీసీ చీఫ్​ పేర్కొన్నారు. కవిత స్వయంగా బీఆర్​ఎస్​ అవినీతిని చెప్తుంటే ఆనందంగా ఉందన్నారు. పదేళ్లుగా బీఆర్ఎస్ నాయకులు రాష్ట్రాన్ని దోచుకున్నారని ఆయన విమర్శించారు. కాళేశ్వరం, భూముల పేరిట దోచుకున్నారని పదేపదే తాము చెప్తూనే ఉన్నామని, కేసీఆర్ కూతురు కవితే తాము దోచుకున్నామని, పదేళ్లు లూటీ చేశామని చెప్పిందన్నారు.

    ఇన్నాళ్లుగా లేనిది ఇప్పుడు వాటాల్లో తేడా రావడంతోనే అవినీతి బయటపడిందన్నారు. దోచుకున్న దాంట్లో ఎక్కువ వాటా కవితకు ఆమె అన్నకే రావాలని, ఎక్కువ వాటా హరీష్ రావుకు, సంతోష్ రావుకు ఎట్లా వెళ్తుందని కవిత బాధ అని ఆయన ఎద్దేవా చేశారు. కవిత బీఆర్​ఎస్​నుంచి బయటకు రావడం కేసీఆర్​ ఆడిస్తున్న నాటకమేనన్నారు. కాళేశ్వరంపై అవినీతి జరిగిందని 90 శాతం ప్రజలు నమ్ముతున్న సమయంలో ప్రజల దృష్టి మళ్లించడం కోసమే కుటుంబ తగాదాలను తెరపైకి తెచ్చి ఉంటారన్న అనుమానం వస్తోందని బొమ్మ మహేశ్​కుమార్​ గౌడ్​ స్పష్టం చేశారు.

    BC Declaration | కుటుంబంలో అందరూ దొంగలే..

    కుటుంబం అంతా దొంగలేనని, దొంగల ముఠా రాష్ట్రాన్ని దోచుకుందని, మరోసారి రాష్ట్రాన్ని ఏలుకుందామని ఆలోచన కల్వకుంట్ల కుటుంబానికి  ఉందన్నారు. కేసీఆర్​ పదేళ్లలో 40 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినంత దోచుకున్నారని ఆరోపించారు. అంతా దోచుకున్న పార్టీ ఇవాళ బజార్లో పడి కొట్టుకుంటే మళ్ళీ ఆదరిస్తామా అని ప్రశ్నించారు. ఏడాది కిందటే అన్నాచెల్లెళ్ల తగాదాలు, కుటుంబ గొడవలు లేనప్పుడే రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలో బీఆర్ఎస్ ఉండదని తాను చెప్పానని, ఈరోజు నిజం అయిందన్నారు.

    BC Declaration | కనీవినీ ఎరుగని రీతిలో సభ

    కామారెడ్డి పట్టణంలో ఈనెల 15 న నిర్వహించే సభ కనీవినీ ఎరుగని రీతిలో ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) అన్నారు. జనగణన, కులగణన శాస్త్రీయ బద్దంగా చేశామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కారుకూతలు కూసినా, కుట్రలు చేసినా, గుడ్డ కాల్చి మీద వేసినా చిత్తశుద్ధితో బీసీ బిల్లు తీర్మానం చేశామన్నారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు సహకరించకపోయినా ముందుకు వెళ్తున్నామన్నారు. సభను విజయవంతం చేయడానికి లక్షలాదిగా ప్రజలు తరలిరావాలని కోరారు.

    BC Declaration | నిబద్ధతతో బీసీ రిజర్వేషన్ అమలు

    నీతి, నిజాయితితో, నిబద్ధతతో బీసీ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని మంత్రి సీతక్క(Minister Seethakka, ) తెలిపారు. రాష్ట్రం పంపిన బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆమోదించకుండా అడ్డుకుంటూ రాజకీయం చేస్తుందన్నారు. కులగణనలలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు పాల్గొనలేదన్నారు. సోషల్ ఇంజినీర్, సోషల్ జస్టిస్ జరగాలని బీసీలకు పదవుల పంపకం చేశామని, బీసీలంతా కంకనబద్ధులై సభకు తరలిరావాలని కోరారు.

    BC Declaration | బీసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం

    బీసీలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ (BC Minister Ponnam, ) అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లును ఆమోదిస్తూ తీర్మానం చేశామన్నారు. తీర్మానాన్ని ఆమోదం కోసం గవర్నర్ కు పంపిస్తే అక్కడినుంచి రాష్ట్రపతి ఆమోదం కోసం వెళ్ళిందని, బిల్లు ఆమోదం చేయకుండా కేంద్రం మోకాలడ్డు పెడుతోందని ఆరోపించారు.

    BC Declaration | హామీని నిలబెట్టుకున్నాం

    బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి ద్వారా ఎన్నికల్లో ప్రకటించామని, ఇచ్చిన హామీ ప్రకారం తీర్మానం చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలుపుకున్నామని మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) తెలిపారు. బిల్లు ఆమోదం కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా కూడా చేశామని, బీసీ బిల్లుకు ఇతర పార్టీలు మద్దతిచినా బీజేపీ అడ్డుపడుతోందన్నారు. బీసీల బిల్లుకు కేంద్రం చట్టం తేవాలని డిమాండ్ చేశారు. బీసీ బిల్లు పోరాటం కోసం సమరభేరి మోగించాలని కామారెడ్డిలో సభ నిర్వహిస్తున్నామని, ఈ సభ ద్వారా కేంద్రానికి సంకేతం పంపాలన్నారు.

    BC Declaration | కామారెడ్డి సభ దద్దరిల్లాలి

    కామారెడ్డిలో నిర్వహించే బీసీ సభ దద్దరిల్లిపోవాలని, దాంతో కేంద్రం గుండెల్లో రైళ్లు పరుగెత్తాలని మంత్రి వాకాటి శ్రీహరి(Vakati Srihari) అన్నారు. బీసీల ఐక్యత మరోసారి ఛాటి చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతి రెడ్డి, మదన్ మోహన్ రావు, లక్ష్మీకాంతా రావు, ఎంపీ సురేష్ షెట్కార్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ హందాన్, ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజు, నుడా ఛైర్మన్​ కేశ వేణు, సీనియర్​ నాయకులు నరాల రత్నాకర్​, ఆకుల లలిత, అరికెల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Red Sea | ఎర్ర సముద్రంలో తెగిన ఇంటర్నెట్ కేబుల్స్.. పాక్, మధ్యప్రాచ్య దేశాల్లో ఇంటర్నెట్ సేవలకు అంతరాయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Red Sea | ఎర్ర సముద్రంలో అండర్‌సీ ఇంటర్నెట్ కేబుల్స్ తెగిపోవడంతో పాకిస్థాన్‌ (Pakistan) సహా...

    Rajagopal Reddy | ప్రభుత్వంతో పోరాటానికి సిద్ధం.. మరోసారి రాజగోపాల్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajagopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​రెడ్డి మరోసారి ప్రభుత్వం తీవ్ర వ్యాఖ్యలు...

    Boney Kapoor | శ్రీదేవి కోరిన కోరిక‌లు నిజ‌మే.. శివ‌గామి పాత్ర చేయ‌క‌పోవ‌డానికి కార‌ణం ఇదే అన్న బోనీ క‌పూర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Boney Kapoor | ఇండియన్ సినిమా చరిత్రను మార్చిన చిత్రం ‘బాహుబలి’, దాని సీక్వెల్ గా...