అక్షరటుడే, కామారెడ్డి : MLA KVR | కామారెడ్డి రైల్వేస్టేషన్ (Kamareddy Railway Station) అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. అమృత్ స్కీం (Amrit Scheme) కింద ప్రధాని మోదీ (PM Modi) రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులకు నిధులు మంజూరు చేశారని.. పనులు కొనసాగుతున్నాయన్నారు.
MLA KVR | కోకలు.. మడిగెలు తొలగిస్తే..
అభివృద్ధి విషయంలో ప్రజలు సహకరిస్తే వందేళ్ల భవిష్యత్తు కనిపిస్తుందని తెలిపారు. రైల్వే స్టేషన్ గోడను ఆనుకుని ఉన్న కోకలు, మడిగెలు తొలగిస్తే ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సమస్య తగ్గుతుందన్నారు. స్టేషన్ రోడ్డు మధ్యలో రైల్వే స్టేషన్లోకి ఎంట్రన్స్ ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖ మంత్రిని కోరారు. మడిగెలలో వీధి విక్రయాలు చేస్తున్న వారు తన వద్దకు వచ్చినప్పుడు కూడా షాపులు తొలగించాలని చెప్పినట్టు గుర్తు చేశారు. షాపులను ఖాళీ చేసి రైల్వేకు అప్పగించాలన్నారు. పొట్టిశ్రీరాములు విగ్రహం (Pottisriramulu Statue) వద్ద ఉన్న మున్సిపల్ స్థలంలో 41 మడిగెలు, గంజ్ స్కూల్ వద్ద ఉన్న మున్సిపల్ స్థలంలో 75 మడిగెల నిర్మాణం జరుగుతుందన్నారు. అందులోకి వీధి విక్రయదారులను తరలిస్తామన్నారు.
మున్సిపల్ నిధులతోనే నిర్మాణం జరుగుతుందని, పూర్తి కావడానికి 2 నెలల సమయం పడుతుందన్నారు. ఇందులో ఎలాంటి స్వార్థం, రాజకీయం లేదని స్పష్టం చేశారు. సర్వే నంబర్ 6లో గత 40 ఏళ్లుగా అనధికారికంగా కబ్జాలో ఉన్న రూ. 100 కోట్ల స్థలాన్ని ఇటీవల ఖాళీ చేయించామని, ఒకరిద్దరు తెచ్చుకున్న స్టేను ఈనెల 12న స్టేటస్ కో క్యాన్సిల్ చేయిస్తామన్నారు. ఆదివారం రోజు రోడ్డుపై నిర్వహిస్తున్న కూరగాయల మార్కెట్‌ను (Vegetable Market) సర్వే నంబర్ 6లోకి మారుస్తామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైతులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. రైల్వే స్టేషన్ లోపల కూడా అధికారులు మడిగెలు ఏర్పాటు చేస్తారని పేర్కొన్నారు. అవసరం ఉన్నవారు అద్దె చెల్లించి అందులో ఉండవచ్చన్నారు. మున్సిపల్ స్థలాల్లో కూరగాయల మార్కెట్, ఇతర మార్కెట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు.
