అక్షరటుడే, ఇందూరు : Collector Nizamabad | కేజీబీవీ, మోడల్ స్కూల్ బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) తెలిపారు. కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్లు, మోడల్ స్కూల్ కేర్ స్పీకర్లు, వార్డెన్లకు జిల్లా కేంద్రంలోని కపిల హోటల్లో (Kapila Hotel) నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని గురువారం సందర్శించారు.
Collector Nizamabad | విద్యార్థులు అన్ని అంశాల్లో రాణించేలా..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువులోనే కాకుండా అన్ని అంశాల్లో ప్రతిభావంతులుగా తయారు చేయాలని నిర్వాహకులకు సూచించారు. బాలికలు అనేక సమస్యలతో సతమతమవుతారని, ఆప్యాయతను చూపితే ఇబ్బందులను నిర్భయంగా చెప్పుకుంటారని తెలిపారు. విద్యార్థినుల మానసిక స్థితి, ప్రవర్తన గమనిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం పెంపొందించాలని కలెక్టర్ సూచించారు.
బాలికలపై లైంగికపరమైన దాడులకు సంబంధించిన కేసుల్లో ఎక్కువగా దగ్గరి వారే ఒడిగడుతున్నందున, వారికి పరిపూర్ణమైన అవగాహన కల్పించాలన్నారు. కేజీబీవీలు (KGBV), మోడల్ స్కూల్లలో అవసరమైన సదుపాయాల కల్పనకు ప్రత్యేక చొరవ చూపుతానని, ఎలాంటి వసతులు కావాల్సినా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. గత ఐదు రోజులుగా పలు అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, కామారెడ్డి (Kamareddy), నిజామాబాద్, మంచిర్యాల జీసీడీవోలు భాగ్యలక్ష్మి, సుకన్య, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.