అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CM Revanth Reddy | రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను సాధించడమే ధ్యేయంగా కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (World Economic Forum)పై ఆయన శనివారం సమీక్షించారు.
దావోస్ సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను, దానికి అనుగుణంగా రూపొందించిన క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయాలని సూచించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పడిన తర్వాత రెండేళ్లలో దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా రాష్ట్రానికి లభించిన పెట్టుబడి హామీలు, ప్రతిపాదనల పురోగతితో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్–2025లో ఆకర్షించిన పెట్టుబడులపై ఆయన ఆరా తీశారు.
CM Revanth Reddy | ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలి
పెట్టుబడుల ఆకర్షణలో తెలంగాణ (Telangana)కు ఉన్న సామర్థ్యాలను వినియోగించుకొని, మూడంచెల ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయాలన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ ప్రణాళికలను తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ వేదికగా ప్రపంచానికి వివరిస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కాగా స్పిరిట్ ఆఫ్ డైలాగ్ థీమ్‌తో వరల్డ్ ఎకనామిక్ ఫోరం–2026 సమ్మిట్ జనవరి 19 నుంచి 23 వరకు దావోస్‌లో జరగనుంది. గతంలో పెట్టుబడిదారులతో చేసుకున్న ఒప్పందాలను పునఃసమీక్షించి, వాటి అమలుపై ఫాలోఅప్ చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు.