అక్షరటుడే, భీమ్‌గల్: Mla Prashanth Reddy | భీమ్‌గల్ మున్సిపాలిటీలో రికార్డు స్థాయి నిధులతో అభివృద్ధి పనులు చేపట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు తమ పార్టీకే ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (MLA Vemula Prashanth Reddy) అన్నారు. పట్టణంలోని ఎల్జే ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన మున్సిపల్ స్థాయి పార్టీ కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ (Congress party) వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాబోయే ఎన్నికలకు కార్యకర్తలు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Mla Prashanth Reddy | సర్పంచ్ ఎన్నికల ఫలితాలే నిదర్శనం
ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ (BRS party) తన బలాన్ని నిరూపించుకుందని ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలోని 40కి పైగా గ్రామాల్లో, అలాగే ఏడు మండల కేంద్రాల్లో ఐదు చోట్ల తమ మద్దతుదారులే గెలిచారని గుర్తు చేశారు. గ్రామ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేయడం వల్లే ఈ విజయం సాధ్యమైందని, అదే ఉత్సాహంతో భీమ్‌గల్ మున్సిపాలిటీని (Bheemgal Municipality) కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Mla Prashanth Reddy | భీమ్‌గల్ రూపురేఖలు మార్చాం
ఒకప్పుడు మురికికూపంగా ఉన్న భీమ్‌గల్‌ను కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) సహకారంతో మున్సిపాలిటీగా మార్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెంటనే రూ.35 కోట్ల నిధులతో రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించామన్నారు. ఆర్‌అండ్‌బీ ద్వారా మరో రూ.20 కోట్లతో సెంట్రల్ లైటింగ్, డివైడర్లు ఏర్పాటు చేసి పట్టణాన్ని సుందరీకరించామని వేముల వివరించారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు, రూ.35 కోట్లతో వంద పడకల ఆస్పత్రి, కప్పలవాగుపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణం వంటి పనులు తమ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు.
Mla Prashanth Reddy | కాంగ్రెస్ అంటేనే ‘బాకీ కార్డు’
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు పంచిన గ్యారంటీ కార్డులు ఇప్పుడు ‘బాకీ కార్డులు’గా మారాయని వేముల ఎద్దేవా చేశారు. ‘రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి కాలేదు. రైతు భరోసా, తులం బంగారం, మహాలక్ష్మి పథకం కింద రూ.2,500, నిరుద్యోగ భృతి వంటి అనేక హామీలను ప్రభుత్వం గాలికొదిలేసింది. ప్రజల వద్దకు కాంగ్రెస్ వారు ఓట్ల కోసం వస్తే.. ఈ బాకీ కార్డును చూపించి నిలదీయండి’ అని కార్యకర్తలకు సూచించారు.
Mla Prashanth Reddy | నిధులు రాక నిలిచిన పనులు
ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకుంటోందని వేముల మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన వంద పడకల ఆస్పత్రి, వెజ్ నాన్‌వెజ్ మార్కెట్ పనులకు బిల్లులు చెల్లించకుండా కాంట్రాక్టర్లను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. టికెట్ ఎవరికి వచ్చినా భేదాభిప్రాయాలు పక్కన పెట్టి, పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దొంకంటి నర్సయ్య, మాజీ జెడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ మహేష్, ప్యాక్స్ ఛైర్మన్ శివసారి నర్సయ్య, జిల్లా కో-ఆప్షన్ సభ్యులు మొయీజ్, పసుల ముత్తెన్న, శర్మ నాయక్, మాణిక్యాల శ్రీనివాస్, తుక్కజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.