అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Tapping Case | మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ (Telangana Bhavan)లో మీడియాతో మాట్లాడారు. సిట్ విచారణకు హాజరు అయ్యే ముందు హరీశ్‌రావుతో కలిసి తెలంగాణ భవన్‌కు వచ్చారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని కేటీఆర్ (KTR)కు సిట్ గురువారం నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ (Jubilee Hills Police Station)లో విచారణకు హాజరు అవుతారు. ఈ క్రమంలో కేటీఆర్ మాట్లాడూతు. ఎన్ని కేసులు పెట్టినా.. భయపడకుండా రాష్ట్రం కోసం పోరాడిన నాయకత్వం తమ పార్టీది అన్నారు. అనుక్షణం ప్రజలు, రాష్ట్రం కోసమే పని చేశామని చెప్పారు. తాము ఎప్పుడూ తప్పుడు పనులు చేయలేదన్నారు. పదేళ్లు రాష్ట్రం కోసమే పనిచేశామని, ప్రతిపక్షాలను వేధించలేదన్నారు. విచారణలకు భయపడమని స్పష్టం చేశారు.
Phone Tapping Case | దొంగ ముఖ్యమంత్రి అయ్యాడు
రాష్ట్రంలో దొంగ ముఖ్యమంత్రి అయ్యాడని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2015లో ఆయన ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ రూ.50 లక్షలతో దొరికారన్నారు. ఆయన దొంగ కావడంతో పోలీసులు నిఘా పెట్టి ఉంటారని పేర్కొన్నారు. దాంతో తమకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. అయితే ఆయన తన లాగే అందరూ దొంగతనాలు చేస్తారనుకొని ఇలాంటి విచారణలు చేయిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా ఉందన్నారు. రాష్ట్రాన్ని మంత్రులు దోచుకుంటున్నారని ఆరోపించారు. దొంగతనం చేసి వెంటనే దొరికి పోవడం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రత్యేకత అని ఎద్దేవా చేశారు.
Phone Tapping Case | వ్యక్తిత్వ హననం చేశారు
తాను డ్రగ్స్ తీసుకుంటానని, హీరోయిన్లతో సంబంధాలు ఉన్నాయని వ్యక్తిత్వ హసనం చేశారని కేటీఆర్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ పేరుతో డైలీ సీరియల్‌లా లీకులు ఇచ్చి వ్యక్తిత్వ హసనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువు, ప్రతిష్టకు కలిగిన నష్టానికి ఎవరు బాధ్యులన్నారు. దీని వెనుక కొందరు పోలీసులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారిని వదిలి పెట్టమని హెచ్చరించారు. ఇటీవల హరీశ్‌రావు (Harish Rao) బొగ్గు గనుల కుంభకోణం బయట పెట్టారన్నారు. అయితే దానిపై మంత్రులు, కేంద్రం స్పందించలేదన్నారు. స్కామ్ బయట పెట్టడంతో సాయంత్రం ఆయనకు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. విచారణ పేరిట కాలాయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని సార్లు విచారణకు పిలిచినా తాను వెళ్తానన్నారు.