Homeతాజావార్తలుCM Revanth Reddy | భవిష్యత్​ తరాల కోసం ఫ్యూచర్​ సిటీ నిర్మిస్తున్నాం.. సీఎం రేవంత్​రెడ్డి

CM Revanth Reddy | భవిష్యత్​ తరాల కోసం ఫ్యూచర్​ సిటీ నిర్మిస్తున్నాం.. సీఎం రేవంత్​రెడ్డి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CM Revanth Reddy | భవిష్యత్​ తరాల కోసం భారత్​ ఫ్యూచర్​ సిటీ నిర్మాణం చేపడుతున్నామని సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫ్యూచర్​ సిటీ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.

రంగారెడ్డి జిల్లా (Rangareddy District) మీర్‌ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ (FCDA) భవనానికి ఆదివారం భూమిపూజ చేశారు. అలాగే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సీఎం మాట్లాడారు. ఇక్కడ తనకు భూములు ఉన్నాయని, అందుకే ఫ్యూచర్​ సిటీ (Future City) నిర్మిస్తున్నాని కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.

తనకు భూములు ఉంటే అందరికీ కనిపిస్తాయని, దాచిపెడితే దాగవు అని చెప్పారు. భారత్​ ఫ్యూచర్​ సిటీని న్యూయార్క్ (New York)​, సింగపూర్​తో సమానంగా అభివృద్ధి చేస్తామన్నారు. తనకు పదేళ్ల సమయం ఇస్తే న్యూయార్క్​లో ఉన్నవాళ్లు కూడా తాము ఫ్యూచర్​ సిటీకి వెళ్లొచ్చామని చెప్పుకునేలా తీర్చిదిద్దుతామన్నారు.

CM Revanth Reddy | వారికి న్యాయం చేస్తాం

ఇంత పెద్ద అభివృద్ధి జరిగితే కొంతమందికి నష్టం జరిగి ఉండొచ్చని సీఎం అన్నారు. అయితే వారిని ఆదుకుంటామని ఆయన భరోసా ఇచ్చారు. చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామన్నారు. ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని, కోర్టుల్లో కేసులు వేసి ఆర్థికంగా నష్టపోవద్దని ఆయన సూచించారు. న్యాయవాదులను బతికించడానికి, రాజకీయ పార్టీలో (Political Parties) ఉచ్చుల్లో పడి కోర్టుల్లో కేసులు వేయొద్దన్నారు. ఏ సమస్య ఉన్నా ప్రభుత్వంతో చర్చించాలన్నారు. భూములు కోల్పోతున్న వారికి తాము న్యాయం చేస్తామని చెప్పారు. “మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులను గుంజుకొని వెళ్లం. భూముల విలువ నాకు తెలుసు. భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా” అని సీఎం భరోసా ఇచ్చారు.

CM Revanth Reddy | బుల్లెట్​ ట్రైన్​

గొప్ప నగరాన్ని నిర్మించడానికి తాము చర్యలు చేపడుతున్నామన్నారు. ఫ్యూచర్​ సిటీ నుంచి బెంగళూరు (Bengalore) వరకు రోడ్డు వేయడంతో పాటు బుల్లెట్​ ట్రెయిన్​ కోసం కేంద్రాన్ని ఒప్పించామన్నారు. ఈ సిటీ నుంచి మచిలీపట్నం పోర్టు వరకు 12 లేన్ల గ్రీన్​ఫీల్డ్​ రోడ్డు (Green Field Road) నిర్మిస్తామని తెలిపారు. ప్రపంచంలోని గొప్ప కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేలా చేస్తామన్నారు. ఫ్యూచర్​ సిటీలో పది ఎకరాల భూమిని సింగరేణికి కేటాయించాలని మంత్రులకు సూచించారు. ఇక్కడ సింగరేణి కార్యాలయం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

CM Revanth Reddy | దేశానికి తలమానికం

భవిష్యత్​లో ఫ్యూచర్​ సిటీ దేశానికి తలమానికం అవుతుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Deputy CM Mallu Bhatti Vikramarka) అన్నారు. ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు, విద్యా సంస్థలు ఏర్పాటు అవుతాయని చెప్పారు. స్థానికులకు అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్​బాబు, అడ్లూరి లక్ష్మణ్​కుమార్, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Must Read
Related News