అక్షరటుడే, వెబ్‌డెస్క్: Waking up from sleep | ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం ఎంత ముఖ్యమో, ప్రశాంతమైన నిద్ర కూడా అంతే అవసరం. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ‘నిద్రలేమి’, ‘నిద్రలో అంతరాయం’ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. రాత్రి పడుకున్నాక పదే పదే మెలకువ రావడం అనేది కేవలం అలసటకు మాత్రమే కాదు. అది గుండె ఆరోగ్యం క్షీణిస్తుందనడానికి ఒక సంకేతం కావొచ్చు. నిద్రలో కలిగే ఇటువంటి అంతరాయాలను తేలికగా తీసుకుంటే, అవి ప్రాణాంతకమైన గుండెపోటుకు దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Waking up from sleep | గుండెపై నిద్ర ప్రభావం:
నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధనల ప్రకారం.. రాత్రిపూట 7 నుంచి 8 గంటల పాటు నిరంతరాయంగా నిద్రపోవడం శరీరానికి ఎంతో అవసరం. గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన శరీరం తనను తాను మరమ్మతు (Repair) చేసుకుంటుంది. ముఖ్యంగా గుండె విశ్రాంతి పొంది, రక్తపోటు (BP) సాధారణ స్థితికి వస్తుంది. అయితే, నిద్రలో పదేపదే మెలకువ రావడం వల్ల గుండెపై ఒత్తిడి పెరిగి, రక్తనాళాల్లో వాపు ఏర్పడుతుంది. రోజులో ఇలా తరచుగా నిద్రకు భంగం కలిగే వ్యక్తులకు గుండె జబ్బులు వచ్చే అవకాశం 30 శాతం ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
Waking up from sleep | ఎందుకు ఇలా జరుగుతుంది?
అధిక ఆలోచనలు, మానసిక ఒత్తిడి దీనికి ప్రధాన కారణాలు. మెదడు నిరంతరం చురుగ్గా ఉండటం వల్ల నిద్ర గాఢత తగ్గుతుంది. దీనివల్ల రక్తపోటు పెరగడమే కాకుండా, శరీరంలోని గ్లూకోజ్ మెటబాలిజం దెబ్బతింటుంది. ముఖ్యంగా ‘స్లీప్ అప్నియా’ (నిద్రలో ఊపిరి అందకపోవడం) ఉన్నవారు, ఒత్తిడిలో ఉండేవారు, పడుకునే ముందు మొబైల్ చూసేవారు ఈ ముప్పునకు ఎక్కువగా గురవుతారు.
నివారణ మార్గాలు:
పడుకోవడానికి గంట ముందే మొబైల్, టీవీలకు దూరంగా ఉండాలి. నిత్యం ఒకే సమయానికి పడుకోవడం, నిద్రలేవడం అలవాటు చేసుకోవాలి. రాత్రిపూట టీ, కాఫీ వంటి కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు తీసుకోవద్దు. మనసు ప్రశాంతంగా ఉండటానికి యోగా, ధ్యా,నం చిన్నపాటి నడకను అలవాటు చేసుకోవాలి.
నిద్ర విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే, అది గుండెనే కాదు, మొత్తం జీవక్రియనే దెబ్బతీస్తుంది. సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.