అక్షరటుడే, వెబ్‌డెస్క్ : MLA Mahipal Reddy | పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (MLA Mahipal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
మహిపాల్‌రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో (assembly elections) బీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. అనంతరం ఆయన 2024 జులైలో సీఎం సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. అయితే ఇటీవల ఆయనపై అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేశారు. మహిపాల్‌రెడ్డి పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కాంగ్రెస్‌లో చేరిన నాటి నుంచి మహిపాల్‌రెడ్డి అసంతృప్తిగానే ఉన్నారు. గతంలో పలుమార్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల్లో (municipal elections) బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు.
MLA Mahipal Reddy | తప్పటడుగు వేశా
తాను కాంగ్రెస్‌లో చేరడంపై ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితుల వల్ల తప్పటడుగు వేసి కాంగ్రెస్‌లో చేరానన్నారు. పార్టీలో చేరినప్పటి నుంచి నియోజకవర్గానికి, నియోజకవర్గ ప్రజలకు, తనకు వెంట్రుక మందం కూడా లాభం జరగలేదన్నారు. అన్ని వ్యవహారాలను కోర్టు ద్వారానే చూసుకుంటున్నట్లు చెప్పారు. కన్న తల్లిదండ్రుల్లాగా మూడు సార్లు తనకు బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చిందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ట్రేడ్ యూనియన్ నాయకులు, కుల సంఘాలు, వివిధ రంగాల వారు బీఆర్ఎస్కు మద్దతు తెలపాలని సూచించారు.
కాగా మహిపాల్ రెడ్డి ట్రేడ్ యూనియన్ నాయకుడిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించారు. 1995లో పటాన్చెరు ఎంపీటీసీగా గెలిచారు. 2009లో బీఎస్పీలో చేరారు. 2014లో బీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2018, 2023 ఎన్నికల్లో సైతం గెలుపొందారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఆయన పార్టీ మారారు. తాజాగా ఆయన వ్యాఖ్యల నేపథ్యంలో మళ్లీ గులాబీ గూటికి చేరుతారనే ప్రచారం జరుగుతోంది.