అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ujjain | మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లో హింస చెలరేగింది. ఉజ్జయిన్ జిల్లా తరానాలో బజరంగ్ దళ్ కార్యకర్తపై దాడి జరగడంతో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి.
తరానా (Tarana)లో గురువారం సాయంత్రం సోహెల్ ఠాకూర్ అనే వ్యక్తిపై 10 నుంచి 15 మంది రాడ్లతో దాడి చేశారు. దాడిలో ఠాకూర్ తీవ్రంగా గాయపడగా.. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడితో ఘర్షణలు మొదలు అయ్యాయి. శుక్రవారం ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఒక వర్గానికి చెందిన వారు నగరంలో ఒక బస్సును తగలబెట్టారు. అనేక దుకాణాలపై దాడి చేశారు. ఇళ్లపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసులు జిల్లా వ్యాప్తంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. భారీగా బలగాలను మోహరించారు.
Ujjain | నిందితులను అరెస్ట్ చేస్తాం
ఠాకూర్‌పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేయడంతో తరానాలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. శుక్రవారం మధ్యాహ్నం ఒక గుంపు అనేక దుకాణాలు, ఇళ్లపై దాడి చేసి, రోడ్లను దిగ్బంధించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఆ గుంపు ఒక బస్సును తగలబెడుతున్న వీడియోలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతోంది. దీంతో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఎస్పీ ప్రదీప్ శర్మ (SP Pradeep Sharma) మాట్లాడుతూ… నిందితులను అరెస్ట్ చేస్తామన్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దాడి చేసిన వారిని గుర్తిస్తామని తెలిపారు. ఇరువర్గాల ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. కాగా దాడిలో గాయపడ్డ ఠాకూర్ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.