అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Navratri Celebrations | నవరాత్రి పండుగ వేళ భారతదేశం మొత్తం ఉత్సవ మూడ్‌లో మునిగిపోయింది. అంతేకాకుండా ఈ పవిత్ర వేడుకలు పాకిస్థాన్‌లోని హిందూ సముదాయంలో కూడా ఘనంగా జరుగుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో హిందూ యువత గర్భా, దాండియా డాన్సులతో (Dandiya Dance) ప్రత్యేక శోభ సంతరించుకుంది.
ఈ వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాకిస్థాన్‌కు చెందిన హిందూ వ్యక్తి ప్రీతమ్ దేవ్రియా (Pritam Devriya) తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వీడియోలను పంచుకున్నారు. అందులో హిందూ మహిళలు, యువకులు సంప్రదాయ వేషభాషలతో, రంగురంగుల దుస్తులతో గర్భా, దాండియా డాన్స్ చేస్తూ సందడి చేసిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Navratri Celebrations | ఘనంగా వేడుకలు..
ఇవన్నీ కేవలం ఒక వేడుక మాత్రమే కాకుండా, సాంస్కృతిక ఐక్యతకు, భిన్న సంస్కృతుల సహజీవనానికి ప్రతీకగా నిలిచాయి. ఈ వీడియోలపై స్పందించిన నెటిజన్లు పాకిస్థాన్ హిందువులకు శుభాకాంక్షలు తెలిపారు. “హ్యాపీ నవరాత్రి ఫ్రం ఇండియా” అంటూ పలువురు కామెంట్లు పెట్టారు. వేరొక వీడియోను కరాచీకి చెందిన ధీరజ్ అనే హిందూ పంచుకోవడంతో అక్కడ నవరాత్రి వేడుకల ఉత్సాహం మరింత స్పష్టమవుతోంది. ఒక యూజర్ “పాకిస్థాన్‌లో (Pakistan) శాకాహారులు, జైనులు కూడా ఉన్నారా?” అని ప్రశ్నించగా, ప్రీతమ్ దేవ్రియా.. స్పందిస్తూ “ఉన్నారు, శాంతియుతంగా నివసిస్తున్నాము” అంటూ సమాధానమిచ్చారు.
2025లో నవరాత్రి ఉత్సవాలు(Navratri Celebrations) సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2 వరకు జరగనున్నాయి. హిందూ పంచాంగం ప్రకారం, ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ప్రారంభమయ్యే ఈ పండుగ, విజయదశమితో ముగుస్తుంది. ఈ తొమ్మిది రోజులు ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి. ప్రతిరోజూ దేవి భిన్న రూపంలో దర్శనమిస్తారు. గర్భా, దాండియా డాన్సులు ప్రధానంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన సంప్రదాయ నృత్యాలు. గర్భా నృత్యం లోపల దేవిని ఆరాధిస్తూ చుట్టూ తిరుగుతూ చేస్తారు. దాండియా నృత్యంలో కర్రలతో జంటలుగా నాట్యం చేయడం సంప్రదాయం. ఈ నృత్యాలు ఇప్పుడు దేశాన్ని దాటి విదేశాల్లో కూడా ఆదరణ పొందుతున్నాయి. కాగా, ఇటీవల పాకిస్తాన్‌లోని కరాచీలో నివసిస్తున్న కొంకణి మరాఠీ సమాజానికి చెందిన హిందువులు వినాయకుడిని ఉత్సాహంతో, ఎంతో భక్తి శ్రద్దలతో స్వాగతించారు. సాంప్రదాయ పద్దతిలో ఎంతో సంతోషంతో వినాయక చవితి వేడుకలను జరుపుకున్నారు.