అక్షరటుడే, మెదక్ : Medak | మొరం వ్యాపారులు రెచ్చిపోతున్నారు. ఎలాంటి అనుమతులు (Permissions) తీసుకోకుండానే అక్రమంగా మొరం తరలిస్తున్నారు. రాత్రి పగలు తేడా లేకుండా నిత్యం వందల ట్రిప్పుల మొరం తరలిస్తూ.. రూ.లక్షలు సంపాదిస్తున్నారు. అయినా సంబంధిత అధికారులు చర్యలు చేపట్టడం లేదు.
మెదక్ (Medak) జిల్లా పాపన్నపేట (Papannapet) మండలం శానాయిపల్లి సమీపంలోని గుట్టను మొరం వ్యాపారులు తవ్వేస్తున్నారు. జేసీబీలతో తవ్వకాలు చేపట్టి టిప్పర్లు, ట్రాక్టర్లతో తరలిస్తున్నారు. వారం రోజులుగా నిత్యం వందల సంఖ్యలో వాహనాలు వెళ్తుండటంతో దుమ్ముతో ఇబ్బంది పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు.
గుట్టను తవ్వి పెద్ద పెద్ద గుంతలు తీశారని, వానలు పడి అవి నిండితే ఎవరైనా పడి చనిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమంగా నడుస్తున్న పలు వాహనాలను గ్రామస్తులు అడ్డుకున్నారు. రోడ్డుకు అడ్డుగా ట్రాక్టర్ పెట్టి నిరసన తెలిపారు. అధికారులు స్పందించి మొరం వ్యాపారులపై చర్యలు చేపట్టాలని కోరారు.