అక్షరటుడే, బోధన్ : Collector Nizamabad | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాధ్యతలు నిర్వహిస్తున్న అధికారులు విధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) సూచించారు. ఎడపల్లి మండల పరిషత్ కార్యాలయాన్ని కలెక్టర్ గురువారం తనిఖీ చేశారు.
మొదటి విడతలో ఈ మండలానికి ఈనెల 11న పోలింగ్ ప్రక్రియ జరుగనుండగా నామినేషన్ల స్వీకరణ నుంచి మొదలుకుని ఇప్పటివరకు పూర్తిచేసిన ప్రక్రియపై కలెక్టర్, ఎంపీడీవో (MPDO), తహశీల్దార్‌ను (Tahsildar) అడిగి కలెక్టర్ తెలుసుకున్నారు. ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా, ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఓటింగ్‌కు అవసరమైన ఎన్నికల సామగ్రి సిద్ధంగా ఉండాలన్నారు. బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మెటీరియల్, ఎన్నికల సిబ్బంది, జోనల్ అధికారుల నియామకం తదితర ఏర్పాట్ల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న వారితో పాటు, భద్రతా బలగాలలో కొనసాగుతున్న వారు సైతం ఓటుహక్కు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు.
ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం (Election Commission) మార్గదర్శకాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలకు అనుగుణంగా ఎన్నికల విధులను సక్రమంగా నిర్వర్తించాలని కలెక్టర్ సూచించారు. సమీక్షలో ఎంపీడీవో శంకర్, తహశీల్దార్ దత్తాద్రి తదితరులు పాల్గొన్నారు.
