అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Vigilance raids | రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లులపై (rice mills) విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు చేశారు. భారీగా సీఎంఆర్ ధాన్యం దారి మళ్లించినట్లు గుర్తించారు.
రాష్ట్రంలోని 9 జిల్లాల్లోని 19 రైస్ మిల్లులపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందాలు (Vigilance & Enforcement teams ) సోమ, మంగళవారాల్లో తనిఖీలు చేశాయి. మొత్తం రూ. 60 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం దారి మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం 1.90 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్లు ఇతర అవసరాల కోసం తరలించినట్లు పేర్కొన్నారు. 14 మిల్లులు తీవ్రమైన అక్రమాలు, CMR ధాన్యం దారి మళ్లింపులకు పాల్పడినట్లు పేర్కొన్నారు.
Vigilance raids | ఈ జిల్లాల్లో అధికం
సీఎంఆర్ అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లుల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా టాప్‌లో ఉండటం గమనార్హం. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో (Nizamabad district) రూ.19.73 కోట్ల విలువైన ధాన్యాన్ని దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. సూర్యాపేటలో రూ.19.32 కోట్లు, నారాయణపేటలో రూ.15.91 కోట్లు, పెద్దపల్లిలో రూ.11.38 కోట్లు, మహబూబాబాద్ రూ.4.86 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లర్లు దుర్వినియోగం చేశారు. వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు తెలిపారు. ఆయా రైస్‌మిల్లుల లైసెన్స్ రద్దు కోసం సిఫార్సు చేస్తామని పేర్కొన్నారు.
Vigilance raids | యేటా ఇదే తంతు
రాష్ట్ర ప్రభుత్వం వానాకాలం, యాసంగి సీజన్లలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తోంది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్ చేయడం కోసం రైస్ మిల్లులకు కేటాయిస్తోంది. ఒక క్వింటాల్ ధాన్యానికి మిల్లులు 67 కిలోల బియ్యం (సీఎంఆర్) ఇవ్వాల్సి ఉంటుంది. అయితే చాలా మిల్లులు ధాన్యం తీసుకున్నా.. ప్రభుత్వానికి బియ్యం ఇవ్వడం లేదు. కొన్ని మిల్లులు కేటాయించిన ధాన్యం కంటే తక్కువ బియ్యం ఇస్తున్నాయి. యేటా చాలా వరకు మిల్లులు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు.