అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Artificial Intelligence | ఏఐ (కృత్రిమ మేధ) టెక్నాలజీ దుర్వినియోగంతో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. తాజాగా అలాంటి సంఘటనే తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
ఏకంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu),మాజీ మంత్రి దేవినేని ఉమా పేర్లను వాడుతూ, వీడియో కాల్స్ ద్వారా టీడీపీ నేతలను మోసం చేసిన ఘటన కలకలం రేపుతోంది. గత నెల 30న ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులకు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, తాను దేవినేని ఉమా పీఏనని పరిచయం చేసుకున్నాడు. త్వరలో వీడియో కాల్ వస్తుందని చెప్పిన కొద్దిసేపటికి, దేవినేని ఉమా గారిలా మాట్లాడుతున్న వ్యక్తి వీడియో కాల్ చేశాడు.
Artificial Intelligence | భలే బుక్కయ్యారుగా..
తన మాటలతో ఆకట్టుకున్న అతను, తెలంగాణ(Telangana)లో టీడీపీ కార్యకర్తల పిల్లల చదువులకు ఆర్థిక సహాయం చేయాలనుకుంటున్నామని, అందుకు ముగ్గురు వ్యక్తుల ఖాతాలకు డబ్బులు పంపాలని సూచించాడు. నిజమైన నాయకుడిలా కనిపించడంతో వీడియోను నమ్మిన నేతలు రూ.35 వేలు ఫోన్‌పే ద్వారా పంపించారు. ఈ నెల 7న మళ్లీ అదే వ్యక్తి దేవినేని ఉమా పేరుతో మరోసారి వీడియో కాల్ చేశాడు. ఈసారి టార్గెట్ – తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు(Telangana Local Body Elections). టికెట్లు (బీఫామ్) ఇప్పిస్తానని నమ్మించి, చంద్రబాబు నాయుడు వీడియో కాల్‌లో మాట్లాడతారని చెప్పాడు. కాసేపటికే చంద్రబాబును పోలిన వ్యక్తి వీడియో కాల్‌లో ప్రత్యక్షమై, పార్టీ కోసం ఆసక్తి ఉన్నవారి వివరాలు సేకరించాలని చెప్పాడు.
ఆ తర్వాత విజయవాడకు వచ్చి ఓ హోటల్‌లో దిగమని సూచించాడు. హోటల్ సిబ్బందితో కూడా మాట్లాడి, తమ పార్టీ నాయకులు వస్తున్నారనీ, బస బిల్లు తానే చెల్లిస్తానని తెలిపాడు. నిజంగా పార్టీ నుండే నుంచి కాల్ వచ్చిందని నమ్మిన 18 మంది టీడీపీ నాయకులు బుధవారం విజయవాడ చేరుకున్నారు.బుధవారం సాయంత్రం మళ్లీ వీడియో కాల్ చేసిన మోసగాడు, సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లే అవకాశం కేవలం 8 మందికే ఉందని, అందుకోసం ఒక్కొక్కరు రూ.10 వేలు చెల్లించాలని అన్నారు. ఇదే సమయంలో హోటల్ సిబ్బంది భోజనాలకి సంబంధించి బిల్లు పే చేయాలని డిమాండ్ చేయడంతో టీడీపీ నేతలు ఆందోళనకు లోనయ్యారు. హోటల్‌లో జరిగిన గొడవకి సంబంధించిన విషయం పోలీసుల వరకు వెళ్లింది. దాంతో వారు రంగంలోకి దిగారు.
పోలీసులు రంగంలోకి దిగిన వెంటనే, దేవినేని ఉమాను సంప్రదించారు. ఆయన తాను ఎవరికీ వీడియో కాల్ చేయలేదని స్పష్టం చేశారు. అంతేకాదు, ఈ మోసాల వెనుక ఏలూరు జిల్లాకు చెందిన భార్గవ్ అనే వ్యక్తి ఉన్నట్లు సమాచారం అందిందని, ఇప్పటికే తాను పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించారు. ఇక మోసాన్ని అర్థం చేసుకున్న ఖమ్మం జిల్లాకు చెందిన టీడీపీ నాయకులు కలవరపాటుకి గురయ్యారు. పరువు పోతుందన్న భయంతో పోలీసులకు ఫిర్యాదు చేయకుండా వెనక్కి తగ్గినట్లు సమాచారం.