అక్షరటుడే, కోటగిరి : Pothangal | గత వర్షాకాలంలో గోడకూలిన ఘటనలో తనకు నష్టపరిహారం అందకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి ఎలక్ట్రికల్ టవర్ ఎక్కాడు. ఈ ఘటన కోటగిరి మండలం (Kotagiri Mandal) పోతంగల్ గ్రామంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పోతంగల్ గ్రామంలో ఇoదురు సాయిలు తన భార్యపిల్లలతో నివాసముండేవాడు. అయితే గత వర్షాకాలంలో భారీ వర్షానికి ఇంటిపక్కన ఉన్న గోడకూలి తన భార్య, కూతురు మృతి చెందారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.
ఆ సమయంలో ఇంటిపక్క వారు సాయిలుకు నష్టపరిహారం ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. దీంతో మనస్థాపానికి గురైన సాయిలు సోమవారం ఉదయం గ్రామ శివారులోని ఎలక్ట్రికల్ టవర్ (Electrical Tower) ఎక్కి విద్యుత్ వైర్లు పట్టుకుని చనిపోతానని భీష్మించుకు కూర్చున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే ఎస్సై సునీల్ (SI Sunil)కు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, అతడి కుల పెద్ద మనుషులతో మాట్లాడించారు. న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి సాయిలును కిందికి దించారు.