అక్షరటుడే, వెబ్‌డెస్క్: Traffic Alert | సంక్రాంతి సెలవులు (Pongal Holidays) ముగియడంతో హైదరాబాద్ నుంచి స్వగ్రామాలకు వెళ్లిన ప్రజలు తిరిగి నగరానికి చేరుకునే ప్రయాణాలు మొదలుపెట్టారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారి–65 (హైదరాబాద్–విజయవాడ మార్గం)పై ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడే పరిస్థితి ఉండడంతో, ముందస్తు చర్యలుగా దారి మళ్లింపులు చేపట్టినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ శత్ చంద్ర పవార్ వెల్లడించారు.
Traffic Alert | ఈ రూల్స్ పాటించండి..
ఎన్‌హెచ్–65పై చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు కొనసాగుతున్నందున అక్కడ వాహనాల కదలిక మందగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రయాణికులకు సురక్షితంగా మరియు సాఫీగా ప్రయాణం కల్పించాలనే ఉద్దేశంతో నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ప్లాన్‌ను అమలు చేస్తోంది.
ఈ క్రమంలో హైదరాబాద్‌కు (Hyderabad) వెళ్లే వాహనాల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు గుంటూరు – మిర్యాలగూడ – హాలియా – కొండమల్లేపల్లి – చింతపల్లి – మాల్ మార్గంలో ప్రయాణించాలి. మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వారు మాచర్ల – నాగార్జునసాగర్ – పెద్దవూర – కొండపల్లేపల్లి – చింతపల్లి – మాల్ రూట్‌ను అనుసరించాలని సూచించారు.
నల్లగొండ జిల్లా (Nalgonda District) కేంద్రం నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు నల్లగొండ – మార్రిగూడ బైపాస్ – మునుగోడు – నారాయణపూర్ – చౌటుప్పల్ (ఎన్‌హెచ్–65) మార్గంలో వెళ్లాలి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వచ్చే భారీ వాహనాలు కోదాడ – హుజూర్‌నగర్ – మిర్యాలగూడ – హాలియా – చింతపల్లి – మాల్ వైపు మళ్లించనున్నారు. ఎన్‌హెచ్–65పై చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిన పరిస్థితి ఏర్పడితే, చిట్యాల నుంచి భువనగిరి మీదుగా హైదరాబాద్‌కు వాహనాలను మళ్లించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వాహనాలను మళ్లించడం వల్ల విజయవాడ–హైదరాబాద్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గుతుందని, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకునే అవకాశం ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను పాటించి సహకరించాలని ఆయన కోరారు.