అక్షరటుడే, వెబ్డెస్క్ : PM Modi | స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణ వందేమాతరం గేయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయ గేయం వందేమాతరం 150 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం లోక్సభ (Lok Sabha)లో ఆయన చర్చ ప్రారంభించారు.
వందేమాతరం (Vande Mataram) గేయంపై లోక్సభలో పది గంటల పాటు చర్చించనున్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం భారతీయుల గళం అన్నారు. ఈ చర్చలో పాల్గొనడం తనకు గర్వకారణమని చెప్పారు. వికసిత్ భారత్ లక్ష్యంగా తాము ముందుకు వెళ్తున్నట్లు ప్రధాని తెలిపారు. ఈ చర్చలు భవిష్యత్తు తరానికి స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. వందేమాతరం అనేది ఒక మంత్రం అని, స్వాతంత్య్ర ఉద్యమానికి శక్తి, ప్రేరణనిచ్చిందన్నారు.
PM Modi | చారిత్రాత్మక క్షణం
వందేమాతరం గీతంపై చర్చ చేపట్టినందుకు సభ్యులకు ప్రధాని ధన్యవాదాలు తెలిపారు. స్వాతంత్య్ర సమరంలో కోట్ల మందికి స్ఫూర్తి నింపిన గీతంపై చర్చ జరపడం మనందరి అదృష్టం అన్నారు. ఈ చర్చ చరిత్రతో ముడిపడిన అనేక ఘట్టాలను మన కళ్ల ముందుకు తీసుకొస్తుందన్నారు. వందేమాతరం 150 సంవత్సరాలకు మనం సాక్షులుగా మారడం గర్వకారణం అని మోదీ అన్నారు. ఇది ఒక చారిత్రాత్మక క్షణం అని ఆయన అభివర్ణించారు. వందేమాతర గీతానికి దాని గౌరవాన్ని తిరిగి తెచ్చి పెట్టాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎమర్జెన్సీ ఉక్కుపాదం కింది వందేమాతరాన్ని తొక్కిపెట్టారని విమర్శించారు.
అన్ని పార్టీల ఎంపీలు వందేమాతరం చర్చలో పాల్గొననున్నారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గగోయ్ (Gaurav Gogoi), ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) తదితరులు మాట్లాడారు. రాజ్యసభ (Rajya Sabha)లో వందేమాతరంపై మంగళవారం చర్చను కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) ప్రారంభించనున్నారు.